నిందితుడు వెంకట్ యాదవ్
బంజారాహిల్స్: హిజ్రాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటూ అటు పోలీసులకు, ఇటు హిజ్రాలకు చుక్కలు చూపిస్తూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కురుమ వెంకటేష్ అలియాస్ గ్రానైట్ వెంకట్ అలియాస్ వెంకట్‌యాదవ్ అలియాస్ వెంకట్ అలియాస్ చిన్నాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.కళింగరావు, డీఐ కె. రవికుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, కక్కాలపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్ యాదవ్‌కు 2009లో ఎల్బీనగర్‌లో దివ్య అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. అనంతరం వెంకట్‌కు వివాహం జరిగింది. తనను వదిలి భార్యతో కాపురం చేస్తున్న వెంకట్‌పై కోపం పెంచుకున్న దివ్య అతడి గ్రామానికి వెళ్లి గొడవ చేసింది. తన పరువు తీసిందని దివ్యపై పగబట్టిన వెంకట్ ఆమెను హత్య చేసేందుకు నగరానికి వచ్చాడు.
దివ్య ఆచూకీ తెలుసుకునే ప్రయతత్నంలో కూకట్‌పల్లిలో ప్రవళ్లిక అనే మరో హిజ్రాను బండరాయితో మోది దారుణం హత్య చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసిందన్న కసితో హిజ్రాలపై కక్ష పెంచుకొని వారినే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డాడు. తరచూ వారిపై లైంగిక దాడులకు పాల్పడటమేగాక నగదు, నగలు దోచుకునేవాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్‌నెం. 2లోని ఇందిరానగర్‌లో మకాం వేసిన అతను గతేడాది ఇందిరానగర్‌లోనే ఓ హిజ్రాతో మాట్లాడుతున్న బ్రహ్మం అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 27న యాస్మిన్ అనే హిజ్రా ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి రూ. 2 లక్షల నగదు, బంగారు దోచుకెళ్లాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వెంకట్ పోలీసుల కళ్లుగప్పి వివిధ రాష్ట్రాల్లో మకాం వేశాడు.
పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ డీఐ రవికుమార్ రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ లాడ్జీలో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న వెంకట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో వెంకట్ క్రిమినల్ చిట్టా వెలుగు చూసింది. ప్రతినెలా హిజ్రాల నుంచి హఫ్తాలు వసూలు చేయడం, తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడులకు పాల్పడటం, హిజ్రాల ఇళ్లల్లోకి చొరబడి నగదు ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై గోపాలపురం, మాదాపూర్, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, బంజారాహిల్స్, బాలానగర్, ఎల్బీ నగర్, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడి వెంకట్ యాదవ్‌ను పట్టుకున్న బంజారాహిల్స్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు సూచనలు, సమాచారంతో డీఐ రవికుమార్ లక్ష్యాన్ని ఛేదించారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment