గుంటూరు రౌడీల గ్యాంగ్‌వార్ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరం మళ్లీ రౌడీషీటర్ల ఆధిపత్య పోరుతో అట్టుడుకుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కిరాతక హత్యలకు కూడా వెనుకాడకపోవడంతో నడిరోడ్డుపై రక్తచారికలు తరచూ కన్పిస్తున్నాయి. దీనికి ఆదివారం రాత్రి అరండల్‌పేటలో జరిగిన రౌడీషీటర్ వాసు హత్యే ఓ ఉదాహరణ. ఒక ఏడాది ముగిసేలోపే 10 హత్యలు జరిగాయంటే హింస తీవ్రత ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గ్యాంగ్‌వార్‌తో ప్రజాజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాల్సిందే.
సినీఫక్కీలో పక్కా స్కెచ్...
గుంటూరు నగరం. రద్దీగా ఉండే అరండల్‌పేట ప్రాంతం. 12వ లైను. ఆదివారం రాత్రి 8.26 గంటల సమయంలో వందలాది మంది జనం చూస్తుండగా అన్వర్ బిర్యానీ పాయింట్ ఎదురుగా నడిరోడ్డుపై రౌడీషీటర్ బసవల భారతి వాసును ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. సినీఫక్కీలో స్కార్పియో వాహనంతో ఢీకొట్టి కిందపడిపోయిన వాసుపై ఐదుగురు వ్యక్తులు 30 సెకన్లలో 30 కత్తి పోట్లు పొడిచారు. ఘటనతో అక్కడ ఉన్న ప్రజలంతా కేకలు పెడుతూ పరుగులు తీశారు. అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య జరగడం చూస్తుంటే హంతకులకు పోలీసులంటే ఏమాత్రం భయం ఉందో అర్థం చేసుకోవచ్చు.
రక్తపు చారికలెన్నో..
⇒ గతేడాది డిసెంబరులో గుంటూరు అరండల్‌పేట 3/2లోని ఓ హోటల్ ఎదురుగా రాత్రి 8 గంటల సమయంలో రౌడీషీటర్ బొప్పన రవిని నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.
⇒ 2016 డిసెంబరులో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వల్లపు గోపి అనే వ్యక్తిని నగరంపాలెం పోలీసు స్టేషన్ ఎదురుగా ఆటోలో గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఎక్కించి గుంటూరు రూరల్ మండలం బుడంపాడు కాలువ వరకూ తీసుకెళ్లి హతమార్చారు. ఆదిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగినట్లు పోలుసులు గుర్తించారు.
⇒ ఈ మార్చి 6న నాగెండ్ల కల్యాణ్‌రామ్ అనే యువకుడిని ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు మట్టుపెట్టారు.
⇒ కొన్నాళ్ల కిత్రం గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో ఆగంతకులు ముగ్గురు యువకులను దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు.
⇒ మూడు నెలల క్రితం ఆంజనేయులు అనే రౌడీషీటర్‌ని ఏటుకూరు రోడ్డులోని చాకలికుంట సెంటర్‌లో ప్రత్యర్థులు నరికి చంపారు. ఇలా ఒక్క ఏడాదిలో 10 హత్యలు జరిగాయి.
చోటా అనుచరులతో సెటిల్‌మెంట్లు..
గతంలో లిస్టులో మోస్ట్ వాంటెడ్‌గా రౌడీషీటర్లు బయటకు రాకుండా ఇప్పుడు చోటా అనుచరులకు బాధ్యతలు అప్పగించి వారిచేత సెటిల్‌మెంట్లు చేయిస్తున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని పాతగుంటూరు, శ్రీనివాసరావుపేట వంటి ప్రాంతాల్లో హవా కొనసాగిస్తున్న రౌడీ షీటర్లు అధికార పార్టీ నాయకులతో తప్పించుకు తిరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. రౌడీషీటర్లు మాత్రం తమను పోలీస్ స్టేషన్లకు పిలిపించరాదంటూ అధికార పార్టీ నేతలతో పోలీస్ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కొందరు వైట్‌కాలర్ నేరస్థులైతే తమకు ప్రాణహాని ఉందని లైసెన్స్‌డ్ గన్ తీసుకునేపనిలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతివారం రౌడీషీటర్లను పోలీసు స్టేషన్‌లకు పిలిచి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం, వారి కదలికలపై పూర్తి నిఘా ఉంచాల్సిన పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి అని వేరే చెప్పనక్కర్లేదు.
రౌడీషీటర్ల నగరం నుంచి బహిష్కరిస్తాం..
రౌడీషీటర్ బసవల వాసు హత్య ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని డీఎస్పీలు, సీఐలతో అత్యవసర సమావేశం నిర్వహించాం. రౌడీషీటర్ల భరతం పట్టాలని ఆదేశాలు జారీ చేశాం. వారం రోజుల్లో నగరంలో రౌడీషీటర్ల జాబితా సిద్ధం చేస్తాం. వారిని నగరం నుంచి బహిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నాం. సెటిల్‌మెంట్లు, దందాలు ఎవరినీ ఉపేక్షించం. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎవరినీ ఉపేక్షించాం. శాంతి భద్రతల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటాం. రౌడీషీటర్లను కట్టడి చేసి నేరాల పని పడతాం. – అర్బన్ ఎస్పీ విజయారావు
Comments
Please login to add a commentAdd a comment