చండీగఢ్: గురుగ్రాంలో కలకలం సృష్టించిన న్యాయమూర్తి కృష్ణకాంత్ గార్గ్ భార్య, ఆయన కొడుకు హత్య కేసులో హర్యానా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరిపై కాల్పులకు పాల్పడిన సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దాదాపు 64 మంది సాక్షులను విచారించిన తర్వాత దోషి మహిపాల్‌కు మరణ దండన విధిస్తున్నట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సుధీర్ పర్మార్ తీర్పు వెలువరించారు. కాగా 2018 అక్టోబరులో హర్యానాలోని గురుగ్రామ్‌లో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య రీతూ, కొడుకు ధృవ్‌పై వారి సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మార్కెట్లో అందరి ముందే ఘాతుకానికి పాల్పడిన అతడు.. అనంతరం వారి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. జడ్జికి ఫోన్ చేసి.. ‘నీ భార్యా, కొడుకును కాల్చి చంపేశా’ అని చెప్పాడు. ( మహిపాల్ హంతకుడిగా మారడం వెనుక అసలు కారణం అదేనా?!)
మహిపాల్ సింగ్ పెళ్లినాటి ఫొటో
ఇక ఈ ఘటనలో గాయపడిన రీతూ చికిత్స పొందుతూ మరణించగా, అతని కుమారుడు ధ్రువ్ బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో ఫరీదాబాద్ వద్ద పోలీసులు మహిపాల్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనకు సెలవులు ఇవ్వకపోవడం, వేధించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మహిపాల్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల విచారణ అనంతరం మహిపాల్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇక మహిపాల్ స్వగ్రామం మహేంద్రగఢ్ కాగా.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిపాల్ భార్య టీచర్‌గా పనిచేస్తోంది. వృత్తిపరమైన ఒత్తిళ్లతో పాటు వ్యక్తిగతంగా కూడా మహిపాల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని.. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఈ విధంగా ప్రవర్తించి ఉంటాడని అతడి సన్నిహితులు గతంలో మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment