హాజీపూర్‌ బాధితుల దీక్ష భగ్నం | Hajipur victims Protest was retired | Sakshi
Sakshi News home page

హాజీపూర్‌ బాధితుల దీక్ష భగ్నం

Published Sun, May 19 2019 2:33 AM | Last Updated on Sun, May 19 2019 2:33 AM

Hajipur victims Protest was retired - Sakshi

బాలికలను హత్య చేసిన తెట్టె బావిలో ధర్నా చేస్తున్న బాధితులు (వృత్తంలో)

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్‌ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్‌లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు బొమ్మలరామారంలో గురువారం నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీక్ష శిబిరంలో నిద్రిస్తున్న బాధితులను శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న దీక్ష శిబిరాన్ని తొలగించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షలో కూర్చుని అనారోగ్యం బారిన పడిన పక్కీరు రాజేందర్‌రెడ్డి, పాముల ప్రవీణ్‌లను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. వారి ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడ్డాక తిరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం మొదటి విడతలో 15 మందిని వదిలివేశారు. మిగతా వారిని తర్వాత వదిలేశారు.

కొనసాగుతున్న పోలీస్‌ పికెట్‌
ఆందోళనలతో అట్టుడుకుతున్న హాజీపూర్‌ గ్రామంలో పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. వరుస హత్యలు వెలుగు చూసిన నాటినుంచి గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కాగా, శాంతియుతంగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారనే సమాచారంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుం ది. గ్రామంలోని మహిళలందరూ కలసి బొమ్మలరామారం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేసేం దుకు సిద్ధమయ్యారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వ్యక్తులను విడిచి పెట్టారని తెలిసి ధర్నా ప్రయత్నా న్ని విరమించారు. పోలీసులు వదలిపెట్టాక బాలికల ను హత్య చేసిన బావిలోకి దిగి నిరసన చేట్టారనే సమాచారంతో తెట్టెబావి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు.

తెట్టె బావిలోకి దిగిన బాధితులు
ప్రభుత్వం తాము శాంతియుతంగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిందని, తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని బాధిత కుటుంబాల సభ్యులు శ్రావణి, మనీషాలపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన తెట్టెబావిలోకి దిగి అరగంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు.  బాధితులకు న్యాయం చేస్తామని  జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బావి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్లను వివరించారు. బాధితుల డిమాండ్లను సావధానంగా విన్న కలెక్టర్‌ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

నా కొడుకును ఉరి తీయాలి  
శ్రీనివాస్‌రెడ్డి తండ్రి బాల్‌రెడ్డి
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ వరుస హత్యల కేసులో తన కొడుకు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని నిందితుడి తండ్రి బాల్‌రెడ్డి శనివారం మీడి యా ముందు కోరారు. శ్రీనివాస్‌రెడ్డి దురాగతాలు తమకు తెలియవన్నారు. గతంలో కర్నూల్‌లో ఓ కేసు విషయమై బెయిలుపై విడిపించామని తెలిపారు. శ్రావణి హత్యకు పాల్పడినప్పుడు మృతదేహాన్ని వెలికి తీస్తున్న సమయంలో తమతోపాటే తన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి బావి వద్దనే ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో, మరుసటి రోజు అతని ముఖంలో ఎలాంటి భ యం, ఆందోళన కనిపించలేదన్నారు. ఏదైనా పనిచేయాలని చెబితే తనవైపు ఉరిమి చూసేవాడని బాల్‌రెడ్డి వెల్లడించారు. అనుమానంతో పోలీసులు ఇంటికి వస్తే ఈ హత్యలలో నీ హస్తం ఏమైనా ఉందా? అని అడిగితే.. ‘నీకేం భయం వద్దు. ఆ హత్యలతో నాకేం సంబంధం లేదు’అని బుకాయించాడన్నారు. 

ఆధారాలు లభించవు అన్నాడు 
శ్రావణి పోస్ట్‌మార్టంలో అన్ని విషయాలు బయటæపడతాయని తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడని అతని సోదరుడు మర్రి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని.. పోస్టుమార్టంలో కూడా ఆధారాలు లభించవని శ్రీనివాస్‌రెడ్డి బుకాయించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ఇలాంటి క్రూరుడనే విషయం తెలిసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు చేసిన పనికి తమను ఎవరూ రానివ్వడం లేదని, హైదరాబాద్‌ బస్టాండ్‌లలో తల దాచుకుంటున్నామని తెలిపారు.  

కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబాలు 

బాధితుల డిమాండ్లు ఇవీ.. 
- నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉరిశిక్ష పడేట్టు చేయాలి. దీనిని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా పరిష్కరించాలి. 
ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. 
బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
హజీపూర్‌–మాచన్‌పల్లి మధ్యన శామీర్‌పేట వాగుపై బ్రిడ్జిని నిర్మించాలి. హజీపూర్, మైసిరెడ్డిపల్లి, తిరుమలగిరి, నాగినేనిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి. 
నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన భూమిని బాధిత కుటుంబాలకు పంచాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement