చెట్టుపై మనీషా అనే పేరుతో మరో రెండు పేర్లు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి అమానుషంగా చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి దినచర్యలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎవరితోనూ పెద్దగా స్నేహంగా ఉండని శ్రీనివాస్‌రెడ్డి గ్రామ సమీపంలోని శమాసుల బావి వద్ద గల మేడిచెట్టుకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. శ్రీనివాస్‌రెడ్డి అరాచ కాలు వెలుగులోకి రాక ముందు నుంచే ఈ మేడిచెట్టుకు అతను పూజలు నిర్వహించేవాడని తెలుస్తోంది.
మేడిచెట్టు ఉన్న ప్రాంతంలోనే వేప, రాగి చెట్లు కూడా ఉన్నాయి. ఏమైనా దోషాలు ఉంటే నివారణ కోసం చెట్లకు పూజలు చేయడం సాధారణం. మరి కొందరు తమకు అంతా శుభం జరగాలనే ఇలాంటి చెట్లకు పూజలు నిర్వహిస్తారు. అదే కోణంలో శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టుతో పాటు రాగి, వేప చెట్లకు పూజలు చేయడాన్ని గ్రామస్తులు పట్టించుకోలేదు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూజలపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.
మేడిచెట్టుపై మూడు పేర్లు
శ్రీనివాస్‌రెడ్డి నిత్యం పూజచేసే మేడిచెట్టుపై మూడు పేర్లు చెక్కి ఉన్నాయి. అందులో ఒక పేరు మనీషాది కనిపిస్తోంది. మరో రెండు శ్రావణి, కల్పన పేర్లుగా భావిస్తున్నారు. రోజూ ఈ చెట్ల వద్దకు వచ్చే శ్రీనివాస్‌రెడ్డి నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను చెట్టు మొదట్లో పెట్టి పూజలు చేసేవాడని సమాచారం.
హత్యలు వెలుగులోకి వచ్చినా పూజలు..
నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టు, రాగి, వేప చెట్లకు చేస్తున్న పూజల వెనక బలమైన కారణం ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలలో మొదటగా వెలుగులోకి వచ్చిన శ్రావణి హత్య అనంతరం కూడా ఈ చెట్లకు పూజలు కొనసాగించాడని తెలిసింది. హాజీపూర్ గ్రామంతోపాటు మండల ప్రజలందరూ భువనగిరి జిల్లా ఆస్పత్రికి శ్రావణి మృతదేహంతో ధర్నాకు వెళ్తుంటే ఇతను మాత్రం ఈ మేడి, రాగి, వేప చెట్లకు పూజలు చేస్తూ గ్రామస్తుల కంట్లో పడ్డాడు. బాలికలపై దారుణాలకు ఒడికట్టింది శ్రీనివాస్‌రెడ్డేనని తెలియక ఈ అంశాన్ని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు హత్యలకు పాల్పడి.. ఎలాంటి బెరుకు లేకుండా చెట్లకు పూజలు చేయడమేంటని హాజీపూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment