సాక్షి, కాకినాడ : రూరల్ మండలం తూరంగిలో ఓ ప్రధానోపాధ్యాయుడ్ని అతని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన కాకినాడలో కలకలం సృష్టించింది. రేపూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న పట్నాల వెంకట్రావు (57) హత్యకు గురయ్యారు. ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీలోనుంచి వెదురు గెడకు చిన్న చాకును కట్టి దాన్ని వంచి తలుపు గెడ తీసి ఇంటి లోపలకు ప్రవేశించిన దుండగులు వెంకట్రావును హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి ముందు దుండగులతో ఆయన పెనుగులాడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే విషయాలు తెలియకపోవడంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ కె.కుమార్, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ వేలిముద్రలు సేకరించాయి. చుట్టు పక్కల ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. కుక్క వాసన చూసుకుంటూ పక్కనే ఉన్న కాలువ వరకూ వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. హత్యకు గురైన వెంకట్రావు తూరంగి సూర్యనగర్ పక్కన ఉన్న రోడ్డు నుంచి కొవ్వూరు వెళ్లే రోడ్డులో ఓ లేఅవుట్‌లో రెండంతస్తుల ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఆ ఇంటి వెనుక మరో రెండంతస్తుల భవనం మాత్రమే ఉంది. చుట్టు పక్కల ఎవరూ నివసించకపోవడం, అంతా ఖాళీ ప్రదేశం కావడంతో వచ్చిన దుండగులు వెంకట్రావును సులభంగా హత్య చేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు. మృతునికి భార్య వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికీ వివాహాలు కావడంతో వెంకట్రావు దంపతులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.
బంధువులు తెలిపిన సమాచారం మేరకు... హైదరాబాదులో ఉంటున్న చిన్న కుమార్తె తులసి రాధికకు, ఆమె పిల్లలకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో భార్యను శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో బస్సు ఎక్కించి ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. తూరంగి భాస్కర గార్డెన్‌వీధిలో నివాసం ఉంటున్న తన వియ్యంకుడు ప్రభాకరరావుతో కొద్దిసేపు ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం ఇంటికి భోజనానికి రావాలని ప్రభాకరరావు కోరడంతో తాను తన అమ్మ సత్యవతిని చూడటానికి కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప వెళ్తానని చెప్పారు.
ఉదయం హైదరాబాద్ చేరుకున్న వెంకట్రావు భార్య వెంకటరమణ ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో తమ వియ్యంకుడు ప్రభాకరరావుకు ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తడంలేదని, ఒక సారి ఇంటికి వెళ్లి చూసి రావాలని కోరారు. దీంతో ప్రభాకరరావు తన మేనల్లుడితో కలసి వెంకట్రావు ఇంటికి వెళ్లారు. ముందు తలుపులన్నీ మూసి ఉండటంతో వెనుక వైపు వెళ్లి చూసేసరికి తలుపులు తీసి ఉండటం, లోపలికి వెళ్లగా వెంకట్రావు శరీరంపై అనేక కత్తిపోట్లతో మృతి చెంది ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ హత్య రాత్రి 11 గంటల సమయంలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్య జరిగిన కోణాన్ని పరిశీలిస్తే దొంగతనం కోసం జరిగినట్టుగా కన్పించడంలేదని, ఏదో కక్షతో ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టు కన్పిస్తుందన్నారు. ఇంట్లో ఏ వస్తువు గానీ, బీరువాను గానీ దుండగులు ముట్టుకోలేదని పోలీసులు చెబుతున్నారు. వెంకట్రావు ఫోను, ల్యాబ్‌టాప్ కన్పించడంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ హత్యకు కారణాలు ఏమిటీ, దొంగతనం కోసం జరిగి ఉంటే ఇంట్లో ఏ ఒక్క వస్తువు పోలేదని, ఆస్తుల గొడవలు ఏమీ లేవని బంధువులు చెబుతున్నారన్నారు. హెచ్‌ఎం వెంకట్రావు హత్య సమాచారం అందడంతో ఉపాధ్యాయులు, అధికారులు, స్నేహితులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో సౌమ్యుడిగా పేరొందిన వెంకట్రావు హత్యను తోటి ఉపాధ్యాయులు, అధికారులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని చూసిన ఉపాధ్యాయులు బోరున విలపించారు. పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment