మృతురాలు వాడపర్తి మంగ
సాక్షి, కాకినాడ : ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. వేగాయమ్మపేట గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని హైస్కూల్ వీధిలో నివాసం ఉండే వాడపర్తి మంగకు మేనమామ సమనస చంద్రరావుతో 35 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం తన సొంత ఊరు ముమ్మిడివరం మండలం కమిడి నుంచి వేగాయమ్మపేటకు చంద్రరావు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు. వారందరికీ వివాహాలు జరిగినా భార్యలతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. చంద్రరావు, కుమారులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
చంద్రరావు పెళ్లయిన నాటి నుంచే అనుమానంతో భార్యను వేధించేవాడు. ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లినా నీ దగ్గరకు వచ్చి వెళ్తున్నారంటూ భార్య మంగతో గొడవ పడి కొడుతుండేవాడు. కొడుకులు, బంధువులు వారించినా వినేవాడు కాదు. శనివారం రాత్రి కూడా 10 గంటల సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. నిన్ను చంపితే పీడ విరగడ అవుతుందని కేకలు వేశాడు. ఉదయం చిన్న కొడుకు వీరబాబు, మంగ చెల్లెలు వాడపర్తి లక్ష్మి టీ ఇద్దామని మంగ దగ్గరకు వెళ్లగా గదిలో మంచంపై భయంకరమైన స్థితిలో మంగ(50) మృతదేహం పడి ఉంది.
గొడ్డలితో బలంగా నరికినట్టు తలభాగం విడిపోయి మెదడు బయటకు వచ్చి చూసేందుకు భయం గొలిపేలా ఉంది. వెంటనే వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారం అందించారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో చంద్రరావు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని టవల్‌లో చుట్టి సైకిల్‌పై తీసుకువెళ్లడం చూశామని కొందరు చెప్పడంతో మంగ తండ్రి వాడపర్తి సూరన్న తన కూతురును హత్య చేసిన చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.
పక్క ఇంట్లో ఉంటున్న బంధువుల ఇద్దరి కుమార్తెలు బాలింతలు. వారి పిల్లలు పాల కోసం ఏడుస్తుండటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంగ వారి ఇంటికి వెళ్లి చంటి పిల్లలను సముదాయించి వెళ్లడంతో హత్య తెల్లవారుజామున చేసి ఉంటాడని భావిస్తున్నారు. రామచంద్రపురం సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ద్రాక్షారామ ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ సంఘటనా స్థలం వద్ద విచారణ నిర్వహించారు. గ్రామ వీఆర్వో వాసంశెట్టి శ్రీరామకృష్ణ పోలీసుల విచారణకు సహకరించారు. మృతురాలి తల్లిదండ్రులు సూరన్న, సత్తెమ్మ, కుమారులు లోవరాజు, గుర్రయ్య, వీరబాబు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది.
ఇంత దారుణం చేస్తాడనుకోలేదు
పెళ్లయిన నాటి నుంచే అనుమానంతో వేధించేవాడు. తరువాత మారతాడులే అనుకునే వాళ్లం. కానీ వయస్సు పెరిగినా అతడిలో అనుమానం చావలేదు. ఇంటికి పెద్ద గోడ కట్టించినా బయటివాళ్లకు మా అమ్మాయి కన్పించకూడదని కొబ్బరి ఆకులు అడ్డం పెట్టాడు. ఎవరు రోడ్డుపై నుంచి వెళ్లినా వాళ్లతో సంబంధం అంటగట్టి గొడవ పెట్టేవాడు. ఏడాది క్రితం నెత్తి మీద కర్రతో గట్టిగా కొట్టడంతో బలమైన గాయం అయ్యింది. అప్పుడు పోలీసు కేసు పెట్టకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాం. ఇప్పుడు ఇంత భయకరంగా నరికి చంపుతాడని ఎవరం ఊహించలేదు. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. – వి.సూరన్న, మృతురాలి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment