హీరో నానికి తృటిలో తప్పిన ప్రమాదం | Hero Nani Car Accident In Jubilee Hills, case filed | Sakshi
Sakshi News home page

హీరో నానికి తృటిలో తప్పిన ప్రమాదం

Published Fri, Jan 26 2018 5:19 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Hero Nani Car Accident In  Jubilee Hills, case filed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో నానికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. షూటింగ్‌ ముగించుకొని శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అతడు తన ఇన్నోవా కారు(టీఎస్‌ 07ఎఫ్‌సి 0024)లో వెళ్తుండగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో కారు నడుపుతున్న డ్రైవర్‌ శ్రీనివాస్‌కు ఒక్కసారిగా నిద్ర ఆవహించింది. దీంతో నిర్మానుష్యమైన ఈ రోడ్డుపై స్పీడ్‌గా వెళ్తూ వేగాన్ని అదుపు చేయలేక డ్రైవర్‌ కారును డివైడర్‌కు ఢీకొట్టాడు. దీంతో కారు ఒక్కసారిగా  పైకి లేచి పక్కనే ఉన్న ఫుట్‌ఫాత్‌ను ఢీకొట్టడంతో ముందు భాగం అంతా నుజ్జునుజ్జు అయింది.

అయితే అదృష్టవశాత్తు నాని కారు మధ్య సీటులో కూర్చోవడం వల్ల ఎలాంటి గాయాల కాలేదు. వెంటనే అతడు క్యాబ్‌లో గచ్చిబౌలిలోని తన నివాసానికి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి శ్రీనివాస్‌ను విచారించగా తాను వేగంగా వెళ్తున్నానని నిద్ర రావడంతో కారు అదుపు తప్పినట్లు తెలిపాడు. శ్రీనివాస్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి శ్వాస పరీక్షలు నిర్వహించగా మద్యం తీసుకోలేదని తేలింది. కాగా సాయంత్రం వరకు ఈ కారులో శ్రీనివాస్‌ ఒక్కడే ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు నాని తండ్రి రాంబాబుకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాని కారులో ఉన్నాడని షూటింగ్‌ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు 3/పీపీడీఏ చట్టం (పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ డిస్ట్రక్షన్‌ యాక్ట్) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కారు హీరో నాని తండ్రి గంటా రాంబాబు పేరు మీద ఉంది.  ఓవర్‌ స్పీడ్‌ కారణంగా గత ఏడాది జూన్‌లో ట్రాఫిక్ పోలీసులు రూ.1400 చలానా విధించారు. అయితే ఆ చలానా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement