ఉరి రద్దు.. తుది శ్వాస వరకూ జైలు | High Court has reduced the sentence of execution to life imprisonment | Sakshi
Sakshi News home page

ఉరి రద్దు.. తుది శ్వాస వరకూ జైలు

Published Sun, Nov 17 2019 4:04 AM | Last Updated on Sun, Nov 17 2019 12:54 PM

High Court has reduced the sentence of execution to life imprisonment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా హన్మకొండలో తొమ్మిది నెలల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన ముద్దాయికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ముద్దాయి ప్రాణం ఉన్నంత వరకూ జైలు శిక్ష అనుభవించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన ముద్దాయి పాలేపాక ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌కు కింది కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును ఖరారు చేయాలని కింది కోర్టు హైకోర్టును కోరింది. దీంతోపాటు ముద్దాయి ప్రవీణ్‌ కూడా హైకోర్టులో క్రిమినల్‌ అప్పీల్‌ దాఖలు చేశాడు. వీటిని విచారించిన ధర్మాసనం క్రిమినల్‌ అప్పీల్‌ను పాక్షికంగా అనుమతిస్తూ 39 పేజీల తీర్పును ఈ నెల 12న వెలువరించింది. పిల్లల సంరక్షణ ప్రత్యేక కోర్టు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించింది.

తీర్పు సారాంశం ఇదీ..
ఉరి అమల్లో ఉన్న అమెరికాతోపాటు ఉరి అమల్లో లేని పలు దేశాల్లోని నేరాల శాతానికి తేడా పెద్దగా లేదని, ఉరి శిక్ష అమలు చేయడం ద్వారా భయాన్ని కలిగించి నేరాలు తగ్గించాలనే ప్రయత్నాలు సరికా దని హైకోర్టు అభిప్రాయపడింది. ‘రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయడంకంటే జీవితాన్ని లేకుండా చేయడం సబబుకాదు. ఉరి శిక్ష విధానంపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ఉరికి మినహా యింపు ఉందని, యావజ్జీవ శిక్షలు విధించవచ్చునని తెలిపింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఉరి శిక్ష విధించాలని బచ్చన్‌సింగ్‌ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది.

హన్మకొండ ఘటనలో 9 నెలల చిన్నారి అత్యాచారం, హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. అయితే అందుకు బాధ్యుడైన నిందితుడు సమాజంలో బతికి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ముద్దాయి గత చరిత్ర చూస్తే గొలుసు దొంగతనాలు చేసిన నేర చరిత్ర మాత్రమే ఉంది. పాతికేళ్ల యువకుడు, అట్టడుగు వర్గాలవాడు. చోరీ కేసు మాత్రమే అతనిపై ఉంది. పథకం ప్రకారం బాలికను హత్య చేసే కుట్రతో వచ్చినట్లుగా ఆధారాలు లేవు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఉరి శిక్ష విధించాలి. ప్రవీణ్‌లో మార్పు లేదని, పశ్చాత్తాపం లేదని కింది కోర్టు తీర్పులో పేర్కొనడాన్ని ఆమోదించలేకపోతున్నాం. అందుకే కింది కోర్టు విధించిన ఉరి శిక్షను, తుదిశ్వాస విడిచే వరకూ జైలు జీవితాన్నే కొనసాగేలా తీర్పు చెబుతున్నాం’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. 

క్రిమినల్‌ అప్పీల్‌ పాక్షికంగా ఆమోదం 
సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించిన వేళల్లో తేడాలు ఉన్నాయి. ఇతర వివరాలు కూడా తేడాలుగా నమోదు చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో వీర్యం అవశేషాలు ఉన్నట్లుంది. అయితే వేరే చోట ఈ విషయం అస్పష్టంగా ఉంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక విషయంలోనూ ప్రాసిక్యూషన్‌ వైఫల్యం చెందింది. డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా తీర్పు చెప్పడానికి వీల్లేదు. నేరస్తుడి పరిస్థితి, నేరం జరిగినప్పటి పరిస్థితుల ఆధారంగా శిక్ష విధించాలనే మార్గదర్శకాలకు విరుద్ధంగా కింది కోర్టు తీర్పు చెప్పింది.. అని క్రిమినల్‌ అప్పీల్‌ వాదనలను హైకోర్టు పాక్షికంగా ఆమోదించింది. 

అప్పుడు ఏం జరిగిందంటే..
ఈ ఏడాది జూన్‌ 17న కె.జంగయ్య, అతని భార్య రచన తమ 9 నెలల బిడ్డను తీసుకుని కుమారపల్లి లోని అత్తవారింటికి వెళ్లారు. భార్య, బిడ్డను వదిలి జంగయ్య ఆ తర్వాత రోజు హైదరాబాద్‌ వచ్చేశాడు. ఆరోజు రాత్రి రచన తన బిడ్డతోపాటు, ఆమె తండ్రి, సోదరులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో రాత్రి 1.30 గంటలకు ప్రవీణ్‌ బిడ్డను ఎత్తుకుపోయాడు. నిద్ర మేల్కొన్న రచన, కుటుం బసభ్యులు బిడ్డ కనబడకపోయేసరికి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఒక వ్యక్తి (ప్రవీణ్‌) ఒడిలో బిడ్డ ఉండటం చూశానని భరత్‌కుమార్‌ చెప్పాడు. ఆ తర్వాత ప్రవీణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు బిడ్డ కింద పడిపోయింది. తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళితే చని పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రత్యేక సెషన్స్‌ కోర్టు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement