సీఐ బదిలీని రద్దు చేయాలని కాటారంలో రాస్తారోకో నిర్వహిస్తున్న కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు
సాక్షి, భూపాలపల్లి : పని చేసిన 11 నెలల్లోనే ఆయన తన మార్క్ చూపించారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల ఆట కట్టించారు. పల్లెల్లో విచ్ఛలవిడిగా వెలసిన బెల్ట్‌షాపుల బెల్ట్ తీశారు. కొందరు పెద్దమనుషులు చేసే సెటిల్‌మెంట్లను కట్టడి చేశారు. అక్కమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న కాటారం సీఐ శంకర్‌రెడ్డి అనతికాలంలోనే బదిలీని బహుమతిగా అందుకున్నారు. దీని వెనక ఇసుకాసురుల లాబీయింగో.. అధిక పార్టీ నేతల ఒత్తిడో బలంగా పని చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒత్తిళ్లతోనే బదిలీ ?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు అనంతరం సీఐ శంకర్‌రెడ్డి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించారు. ఆయన పనితీరును గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కీలకమైన కాటారం సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సాఫీగా పని చేస్తున్న క్రమంలోనే హఠాత్తుగా జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కి తిరిగి బదిలీ చేశారు. అయితే సీఐ బదిలీ వెనుక ఇసుకాసురుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధిక లోడ్‌తో వెళ్లే ఇసుక లారీలను అరికట్టడం, అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించడం మూలంగానే కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోలీసు ఉన్నతాధికారులపై రాష్ట్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సీఐ బదిలీని రద్దు చేయాలని, ఇక్కడే కొనసాగించాలంటూ పలు ప్రజాసంఘాల నాయకులు స్వయంగా కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడం, టీఆర్‌ఎస్ నాయకులు టపాసులు పేల్చడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
వందలాది కేసులు..
అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా కాటారం డివిజన్‌లో జరిగే అనేక అక్రమ కార్యకలాపాలను సదరు సీఐ నిరోధించారనే పేరుంది. గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, బెల్ట్‌షాపులు, క్యాట్ ఫిష్ రవాణాను ఆశించిన స్థాయిలో నివారించినట్లు స్థానికులు తెలుపుతున్నారు.
క్యాట్‌ఫిష్‌లను తరలిస్తున్న 7 వాహనాలు, అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 10 వాహనాలు, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 20 లారీలు, 150 ఓవర్‌లోడ్ ఇసుక లారీలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. 25 మంది గుడుంబా తయారీ, విక్రయదారులు, 40 మంది బెల్టుషాపు నిర్వాహకులపై కేసులు పెట్టారు.
20 మంది గుట్కా విక్రయదారుల పట్టివేతతోపాటు ఏకంగా 20 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. గురువారం సైతం అధిక లోడ్‌తో వెళ్తున్న 36 ఇసుక లారీలను పట్టుకొని కేసు నమోదు చేనినట్లు తెలిసింది. విధి నిర్వహణతో కచ్చితంగా ఉండే పోలీసు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడంపై పోలీసుశాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యులకు భరోసా..
కాటారం ఠాణాకు వచ్చిన పంచాయతీలన్ని పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలోని మామిడి చెట్టు కింద కొందరు పెద్ద మనుషులు సెటిల్‌మెంట్లు చేస్తారనే ఆరోపణలు ఉండేవి. కాగా శంకర్‌రెడ్డి విధుల్లో చేరిన అనంతరం ఈ పంచాయతీలకు చెక్ పెట్టడంతో సామన్య ప్రజలు సైతం పెద్ద మనుషులను ఆశ్రయించకుండా నేరుగా స్టేషన్‌కు వచ్చేదని స్థానికులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment