ఛండీగఢ్ : వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకున్నారు. 38 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పంచకుల అల్లర్లకు పథకం అమలు చేసింది తానేనని నేరాన్ని అంగీకరించారు. ఈమేరకు ఆమె నోరువిప్పి, నిజాలు వెళ్లగక్కారని హరియాణా సిట్ అధికారులు బుధవారం వెల్లడించారు.
రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దోషిగా తేలి, అరెస్టయిన అనంతరం హరియాణ, పంజాబ్ లలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సీబీఐ కోర్టు ఉన్న పంచకుల పట్టణంలోనైతే హింస తీవ్రరూపం దాల్చడం, అల్లర్లలో 38 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విదితమే. ఈ ఘటనలకు సంబంధించి సూత్రధారిగా భావిస్తోన్న హనీప్రీత్ ను ఇటీవలే అరెస్టు చేశారు.
పక్కాగా అమలు చేసిన హనీప్రీత్ : ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో పంచకుల కోర్టు ఆగస్టు 25న గుర్మీత్ ను దోషిగా నిర్ధారించింది. అదే రోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు తీర్పు రావడానికి వారం రోజుల ముందే, అంటే ఆగస్టు 17న డేరా ఆశ్రమంలో కీలక సమావేశం ఒకటి జరిగింది. గుర్మీత్, హనీప్రీత్, డేరా ముఖ్యులు కొందరు పాల్గొన్న ఈ భేటీలో వ్యతిరేక తీర్పు వస్తే ఏం చెయ్యాలనేదానిపై ఒక స్కెచ్ గీశారు. ఆ పథకం ప్రకారమే బాబా అరెస్టైన వెంటనే పలు ప్రాంతాల్లో అల్లర్లు రేపారు. సాధారణ ప్రజలే టార్గెట్ గా హింసకు పాల్పడ్డారు. ఇందుకు అవసరమైన సరంజామా, డబ్బులను డేరా ముఖ్యులు సరఫరా చేశారు.
ల్యాప్ టాప్ లో కీలక సమాచారం : ఏయే ప్రాంతాల్లో అల్లర్లు రేపాలో ముందే పథకాన్ని రచించడంతోపాటు అందుకు అయ్యే ఖర్చును ఒక్కో డేరా ముఖ్యుడికి అప్పజెప్పారు. ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో అల్లర్లు చేయించారు, ఎంతెత డబ్బులు ఇచ్చారు అన్న సమాచారం మొత్తాన్ని హనీప్రీత్ తన ల్యాప్ టాప్ లో స్టోర్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కనిపించకుండా పోయిన ఆ ల్యాప్ టాప్ దొరికితే గనుక అందులోని సమాచారం కేసుకు మరింత ఉపయుక్తం కానుందని సిట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment