బిట్‌కాయిన్స్‌ : గుట్టు రట్టు చేసిన పోలీసులు | Huge robbery with Bitcoins | Sakshi
Sakshi News home page

బిట్‌కాయిన్స్‌తో భారీ దందా

Published Sat, Aug 25 2018 1:31 AM | Last Updated on Sat, Aug 25 2018 9:30 AM

Huge robbery with Bitcoins - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న నగర సీపీ అంజనీకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడి వ్యాపారాల పేరిట ప్రజల్ని నిలువునా దోచుకుని ఆపై వారికి టోపీ పేట్టేయడం ఆ ఘరానా కేటుగాడి నైజం. నాడు గ్లోబల్‌ ఆగ్రోఫామ్స్‌ పేరుతో టేకు చెట్ల ప్లాంటేషన్, గోల్డెన్‌ ఫారెస్ట్‌ కంపెనీ పేరుతో పెట్టుబడికి రెట్టింపు నగదు, నేడు బిట్‌కాయిన్స్‌..ఇలా పేర్లు ఏవైనా పథకం మాత్రం మోసగించడమే. వంచననే వృత్తి, ప్రవృత్తిగా మార్చుకుని అమాయకుల్ని తన బుట్టలో వేసుకుంటున్న ఈ మాయగాడి ఆటల్ని నగర టాస్క్‌ఫోర్స్‌ కట్టిపెట్టింది. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ పూర్తి వివరాలు వెల్లడించారు.  

కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన జి.రమేశ్‌ 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. అప్పట్నుంచీ పలు మోసాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ‘బిట్‌ కాయిన్‌’ పేరుతో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు (ఎంఎల్‌ఎం) ప్రజల్ని మోసగించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ముంబైకి చెందిన సీబీ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వాహకులు మోహన్, సునీల్‌ చౌహాన్‌కు తన పథకం వివరించి రూ.లక్ష చెల్లించాడు. వీరు కాయినెక్స్‌ట్రేడింగ్‌.కామ్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ సృష్టించి ఇచ్చారు. దేశంలో ఎంఎల్‌ఎం నిర్వహణపై నిషేధం ఉన్నందున అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కేంద్రంగా, అమెరికన్ల నేతృత్వంలో ఈ సంస్థ వ్యాపారం సాగిస్తున్నట్లు చూపించాడు.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్‌.సత్తయ్య, ఎన్‌.వెంకటేష్, కె.హరిగోపాల్, సి.శ్రీనివాస్‌లను దళారులుగా పెట్టుకున్నాడు. నమ్మకం కలిగించేందుకు  బోయిన్‌పల్లిలో జీఆర్‌ఎం ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయం తెరిచాడు. వీరితో తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేయించాడు. తమ ద్వారా బిట్‌కాయిన్స్‌లో 100 అమెరికన్‌ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని, 4 నుంచి 10 శాతం వరకు బోనస్‌ కూడా వస్తుందని ఆశ చూపాడు. అలాగే ఓ వ్యక్తి మరికొందరిని చేరిస్తే 60% వరకు కమీషన్‌గా ఇస్తానంటూ ఎంఎల్‌ఎం దందాకు తెరలేపాడు.  

రూ.10 కోట్లకుపైగా పెట్టుబడులు 
రమేశ్‌ మాయమాటలను నమ్మి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడువు తీరినా తమ నగదు ఊసెత్తక పోవటంతో అనుమానమొచ్చిన బాధితులు ఇతనిపై  ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడి తాజా దందా బయటకొచ్చింది. ఈ ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.8 కోట్ల విలువైన నగదు, స్థలాల పత్రాలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన వారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను సంప్రదించాలని కమిషనర్‌ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాన సూత్రధారి రమేశ్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని పోలీసులు నిర్ణయించారు. సీబీ ఆన్‌లైన్‌ సంస్థకు చెందిన సునీల్‌ చౌహాన్, మోహన్‌ను సైతం పోలీసులు నిందితులుగా చేర్చారు. 

రూ. 100 కోట్లకు చేరే అవకాశం! 
ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ. కోట్లలో ఉంది. దీంతో రమేశ్‌ చేతిలో మోసపోయిన వారంతా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే మొత్తం రూ. 100 కోట్లకు చేరే అవకాశమున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ రమేశ్‌ నేరాల చిట్టా 
1999లో గ్లోబల్‌ ఆగ్రో ఫామ్స్‌ ముసుగులో టేకుచెట్ల ప్లాంటేషన్‌ పేరుతో రూ.5 కోట్లను ప్రజలనుంచి రమేశ్‌ వసూలు చేసి మోసగించాడు. 2013లో గోల్డెన్‌ ఫారెస్ట్‌ కంపెనీ పేరుతో తన వద్ద రూ.5 వేలు పెట్టుబడి పెడితే ఎనిమిదేళ్ల తర్వాత రూ.50 వేలు ఇస్తానంటూ వసూలు చేసి మోసం చేశాడు. అదే ఏడాదిలో కొందరితో దురుసుగా ప్రవర్తించి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మూడు కేసుల్లోనూ రమేశ్‌ అరెస్టయినా, ఇతగాడి బుద్ధి మాత్రం మారలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement