న్యూఢిల్లీ: తెలుగులో కొద్ది రోజుల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో హీరో ఫేమస్ అవ్వడం కోసం రాజకీయ నాయకుడి మీద దాడి చేస్తాడు. సేమ్ ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ డెలివరీ బాయ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. దాని కోసం ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులను బెదిరిస్తూ.. ఈ మెయిల్స్ పంపాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది.
వివరాలు.. ముంబైకి చెందిన అభిషేక్ తివారి అనే వ్యక్తి చదువు మధ్యలో మానేసి ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉద్యోగ జీవితం పట్ల నిరాశతో ఉన్న అభిషేక్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. అందుకోసం తొలుత ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్ పంపాడు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కాదని భావించి ఈ సారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు నాయకులను చంపుతానని బెదిరిస్తూ.. మెయిల్స్ పంపాడు. అంతేకాక ఢిల్లీలో ఉన్న ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బాంబు పెట్టి పేల్చేయబోతున్నట్లు మెయిల్ చేశాడు.
ఈ మెయిల్స్ గురించి సీఎం కార్యాలయ సిబ్బంది ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడు ముంబై నాలసొపరా ప్రాంతంలో ఉన్నాడని తెలియడంతో ఓ బృందం అక్కడకు వెళ్లి అభిషేక్ తివారీని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment