కట్నం కోసం దారుణ హత్య | Husband Killed Wife For Extra Dowry Demands | Sakshi
Sakshi News home page

కట్నం కోసం దారుణ హత్య

Apr 20 2018 11:50 AM | Updated on Aug 17 2018 2:56 PM

Husband Killed Wife For Extra Dowry Demands - Sakshi

కాళీ శారద మృతదేహం

మంచిర్యాల(నస్పూర్‌): నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌కాలనీలో వరకట్నం కోసం భార్యను చంపిన సంఘటన సంచలనం లేపింది. శ్రీరాంపూర్‌కాలనీ కటిక దుకాణాల వద్ద నివాసం ఉంటున్న కాళీ శారద(27)ను ఆమె భర్త కాళీ మహేందర్‌ బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్‌ ఆర్‌కే–6 గాంధీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు ఉగ్గ కొమురయ్య కూతురు శారదకు ఆర్‌కే–6 కొత్తరోడ్‌కు చెందిన మహేందర్‌తో 2017 ఆగస్టు 18న రెండో వివాహామైంది. వీరిద్దరికి ఇదివరకే వేరేవారితో వివాహమై విడాకులు తీసుకున్నారు. శారదకు 5 ఏళ్ల కూతురు ఉంది. పెళ్లి సమయంలో రూ.5లక్షలు కట్నం ఒప్పుకుని రూ.50వేలు, రూ.1లక్ష విలువ చేసే సామాన్లు ఇచ్చారు. పెళ్లయిన నెల నుంచే మిగతా డబ్బుల కోసం మహేదందర్‌ శారదను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయమై కుల పెద్దమనుషుల సమక్షంలో రెండుసార్లు పంచాయతీ నిర్వహించారు.

ఇరువురు ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉంటామని హామీ ఇవ్వడంతో నెలరోజులుగా శ్రీరాంపూర్‌కాలనీ కటిక దుకాణాల సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం ఉదయం శారద బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూసే సరికి శారద బెడ్‌పై తల, నోరు నుంచి రక్తస్రావమై మృతి చెంది ఉంది. శారద సోదరుడు ఉగ్గ రాజ్‌కుమార్‌ తన చెల్లిని బావ మహేందర్, అతని తండ్రి పోషం, తల్లి మల్లక్క, బావ బర్ర బాపు కట్నం కోసం వేధించి చం పారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని జైపూర్‌ ఏసీపీ సీతారాములు, శ్రీరాంపూర్‌ సీఐ నారాయణనాయక్‌ సందర్శించి కేసు దర్యాప్తు చేపట్టారు. రాత్రి ఇరువురికి గొడవ జరిగి శారదను తలపై బలంగా కొట్టడంతో తీవ్రరక్తస్రావమై మృతి చెంది ఉంటుందని, మహేందర్‌ పరారీలో ఉన్నాడని ఎస్సై రవిప్రసాద్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement