నిందితుడు వెంకటరమణ
అనుమానం వెంటాడింది. పెనుభూతమై ప్రాణాలను హరించింది. గల్ఫ్ దేశాలకు వెళ్లి సంపాదించిన సొమ్ముతో భార్య విలాసాలకు పాల్పడుతూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. మంగళవారం సాయంత్రం ప్రియుడుతో కలిసి బైకుపై వస్తున్న భార్య రాణి(35)ని భర్త వెంకటరమణ వెంటాడి తల నరికాడు. నరికిన భార్య తలతో నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన సమయంలో బైకుపై వెళుతున్న ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలో ఈ సంఘటన మంగళవారం సాయంత్రం సంచలనం సృష్టించింది. – రాయచోటి/ సంబేపల్లె
వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం వడ్డెపల్లె సమీపంలో పుసుపులేటి వెంకటరమణ(40) అదే గ్రామానికి చెందిన రాణి(35)తో 1999లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొద్ది నెలల కిందటే చనిపోయాడు. కుటుంబ పోషణ నిమిత్తం వెంకటరమణ గల్ఫ్ దేశాలకు వెళ్లి 10 లక్షల రూపాయలకు పైగా సంపాదించి భార్య పేరున పంపాడు. పంపిన డబ్బుతో రాయచోటిలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇలా కలిసి ప్రయాణం సాగిన వీరి కుటుంబంలో ప్రియుడి రూపంలో భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీసింది. గల్ఫ్ దేశం నుంచి కొన్ని నెలల కిందట ఇంటికి వచ్చిన వెంకటరమణ తరుచూ భార్యతో గొడవ పడేవాడు.
నెల రోజుల కిందట భార్య రాణి, ప్రియుడిపైన సంబేపల్లె పోలీసుస్టేషన్‌లో వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. పోలీసులు 497 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య రాణి రాయచోటిలో కొనుగోలు చేసిన ఇంటి జాగా ను విక్రయించేందుకు ప్రయత్నించడంతో పాటు వెంకటరమణ వద్ద ఉన్న జాగా పట్టా కాగితాలను ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్య వివాహేతర సంబంధంతో పాటు గల్ఫ్ నుంచి పంపిన డబ్బులను విలాసాల పేరుతో తగలెట్టిందన్న ఆగ్రహంతో వెంకటరమణ భార్యను నరికి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
వెంబడించి కొడవలితో నరికి..
కొద్ది రోజులుగా భార్య మరొకరితో కలిసి తిరుగుతోందన్న ఆవేశంతో ఎలాగైనా చంపాలన్న నిర్ణయానికి వెంకటమణ వచ్చాడు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం రాయచోటిలోని ఎస్.ఎన్.కాలనీ చెక్‌పోస్టు వద్ద నుంచి బైకుపై ప్రియుడుతో కలిసి రాణి గ్రామానికి బయలు దేరింది. వారిని వెంబడించుకుంటూ వచ్చిన వెంకటరమణ గ్రామ సమీపంలోని సమాధుల వద్దకు రాగానే కొడవలితో దాడి చేశాడు. వెనుకవైపు కూర్చొన్న రాణిని కొడవలితో మెడపై నరకి వేరుచేశాడు. సంఘటనను చూసిన ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నరికిన తలతో వెంకటరమణ నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
నిర్ఘాంతపోయిన గ్రామస్తులు
వెంకటరమణ తన భార్య రాణిని కొడవలితో తల నరికివేశాడన్న సంఘటనతో దుద్యాల గ్రామం వడ్డెపల్లె ప్రజలు ఒక్కమారుగా నిర్ఘాంతపోయారు. భార్యపై ఉన్న అనుమానంతో పాటు రాయచోటిలోని స్థల విషయంపై భార్య భర్తల మధ్య కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటరమణ ఇంత అఘాయిత్యానికి తెగబడతాడని ఊహించలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు...
వెంకటరమణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోనె సంచిలో తెచ్చిన తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై రూరల్ సీఐ నరసింహారాజు, ఎస్‌ఐ సాయిదాశంలు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment