Sambepalle
-
నమ్మించి మోసం చేశాడయ్యా..
సాక్షి, సంబేపల్లె: అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడయ్యా అని మహిళలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలోని కెకె హరిజనవాడ, కడియాలవాండ్లపల్లె, బండకాడ రాజువారిపల్లె, దిగువరాజువారిపల్లె, హరిజనవాడ, చిన్నబిడికి, మొరంవడ్డెపల్లె, కొత్తవడ్డెపల్లె, నాగిరెడ్డిగారిపల్లె, తాటిగుంట హరిజనవాడ, బుర్రవాండ్లపల్లె, గాలివీటిఇండ్లు, పాలెంగడ్డ పాపన్నగారిపల్లె, హరిజనవాడ, దండూరివాండ్లపల్లె, పెద్దబిడికిలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను, మిథున్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తమకు సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని వాపోయారు. చెప్పిన ప్రకారం రుణాలను మాఫీ చేయకుండా మూలధనం, పసుపు–కుంకుమ పేరుతో మభ్యపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లించక తమను మోసగించాడని, మోసాల బాబును నమ్మమని వారు శ్రీకాంత్‌రెడ్డికి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీపై తమకు నమ్మకం ఉందన్నారు. ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటున్నారని మాట్లాడి తమను అవమానపరిచాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని శెట్టిపల్లె గ్రామంలోని దళితులు ఎమ్మెల్యేకి వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిదంబర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, నాయకులు లక్ష్మీకర్‌రెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి, అనిరు«ధ్‌రెడ్డి, ఆనందకుమార్రెడ్డి, బుల్లి వెంకటరమణ, లక్ష్మణనాయక్, శివయ్య, శ్రీనునాయక్, మహేంద్రనాయక్, వెంకటరమణనాయక్, నరసింహారెడ్డి, నాగూనాయక్, రామాంజులు, నాగయ్య, ప్రభాకర్‌నాయుడు, జనార్ధననాయుడు, శ్రీరాములు, వీరమల్లు పాల్గొన్నారు. -
భార్య తల నరికి.. స్టేషన్‌కు తీసుకెళ్లి..
అనుమానం వెంటాడింది. పెనుభూతమై ప్రాణాలను హరించింది. గల్ఫ్ దేశాలకు వెళ్లి సంపాదించిన సొమ్ముతో భార్య విలాసాలకు పాల్పడుతూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. మంగళవారం సాయంత్రం ప్రియుడుతో కలిసి బైకుపై వస్తున్న భార్య రాణి(35)ని భర్త వెంకటరమణ వెంటాడి తల నరికాడు. నరికిన భార్య తలతో నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన సమయంలో బైకుపై వెళుతున్న ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలో ఈ సంఘటన మంగళవారం సాయంత్రం సంచలనం సృష్టించింది. – రాయచోటి/ సంబేపల్లె వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం వడ్డెపల్లె సమీపంలో పుసుపులేటి వెంకటరమణ(40) అదే గ్రామానికి చెందిన రాణి(35)తో 1999లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొద్ది నెలల కిందటే చనిపోయాడు. కుటుంబ పోషణ నిమిత్తం వెంకటరమణ గల్ఫ్ దేశాలకు వెళ్లి 10 లక్షల రూపాయలకు పైగా సంపాదించి భార్య పేరున పంపాడు. పంపిన డబ్బుతో రాయచోటిలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇలా కలిసి ప్రయాణం సాగిన వీరి కుటుంబంలో ప్రియుడి రూపంలో భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీసింది. గల్ఫ్ దేశం నుంచి కొన్ని నెలల కిందట ఇంటికి వచ్చిన వెంకటరమణ తరుచూ భార్యతో గొడవ పడేవాడు. నెల రోజుల కిందట భార్య రాణి, ప్రియుడిపైన సంబేపల్లె పోలీసుస్టేషన్లో వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. పోలీసులు 497 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య రాణి రాయచోటిలో కొనుగోలు చేసిన ఇంటి జాగా ను విక్రయించేందుకు ప్రయత్నించడంతో పాటు వెంకటరమణ వద్ద ఉన్న జాగా పట్టా కాగితాలను ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్య వివాహేతర సంబంధంతో పాటు గల్ఫ్ నుంచి పంపిన డబ్బులను విలాసాల పేరుతో తగలెట్టిందన్న ఆగ్రహంతో వెంకటరమణ భార్యను నరికి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వెంబడించి కొడవలితో నరికి.. కొద్ది రోజులుగా భార్య మరొకరితో కలిసి తిరుగుతోందన్న ఆవేశంతో ఎలాగైనా చంపాలన్న నిర్ణయానికి వెంకటమణ వచ్చాడు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం రాయచోటిలోని ఎస్.ఎన్.కాలనీ చెక్‌పోస్టు వద్ద నుంచి బైకుపై ప్రియుడుతో కలిసి రాణి గ్రామానికి బయలు దేరింది. వారిని వెంబడించుకుంటూ వచ్చిన వెంకటరమణ గ్రామ సమీపంలోని సమాధుల వద్దకు రాగానే కొడవలితో దాడి చేశాడు. వెనుకవైపు కూర్చొన్న రాణిని కొడవలితో మెడపై నరకి వేరుచేశాడు. సంఘటనను చూసిన ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నరికిన తలతో వెంకటరమణ నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిర్ఘాంతపోయిన గ్రామస్తులు వెంకటరమణ తన భార్య రాణిని కొడవలితో తల నరికివేశాడన్న సంఘటనతో దుద్యాల గ్రామం వడ్డెపల్లె ప్రజలు ఒక్కమారుగా నిర్ఘాంతపోయారు. భార్యపై ఉన్న అనుమానంతో పాటు రాయచోటిలోని స్థల విషయంపై భార్య భర్తల మధ్య కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటరమణ ఇంత అఘాయిత్యానికి తెగబడతాడని ఊహించలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు... వెంకటరమణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోనె సంచిలో తెచ్చిన తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై రూరల్ సీఐ నరసింహారాజు, ఎస్ఐ సాయిదాశంలు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఇద్దరు ఎర్రస్మగ్లర్లు అరెస్ట్
సంబేపల్లె: వేర్వేరు చోట్ల ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 దుంగలు, ఒక సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు తెలిపారు. ఆదివారం సంబేపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దుద్యాల గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని ముందస్తు సమాచారం అందడంతో శనివారం సంబేపల్లె ఎస్ఐ సయ్యద్ హాషం తమ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలోనే దుద్యాల వైపు నుంచి టాటా సుమో వాహనం సంబేపల్లె వైపు అతి వేగంగా వస్తుండటంతో పోలీసులు దానిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించారు. సుమోలో ఉన్న ఎర్ర దొంగలు పోలీసులపై రాళ్లురువ్వి, దాడిచేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా తప్పించుకొని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన సయ్యద్నదీమ్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పారిపోయారు. మరో సంఘనటలోదుద్యాల గ్రామం కొత్తపురమ్మ ఆలయం ఆర్చి సమీపంలో ఎర్రచందనం దుంగలు గోనె సంచిలో వేసుకుని వెళ్తున్న పుల్లగూర మోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రెండు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
గుప్త నిధుల తవ్వకం అనుమానంతో అరెస్ట్
సంబేపల్లె: గుప్త నిధులను తవ్వకం చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు వ్యక్తులతో పాటు కారును సంబేపల్లె ఎస్ఐ సయ్యద్ హాసం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నారు. ఆయన కథనం మేరకు.. మండల పరిధిలోని దుద్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు గస్తీ వెళుతుండగా రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పరుగులు పెట్టారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొన్నారు. కర్నాటకకు చెందిన మునిరాజు, చంద్రశేఖర్, విశ్వనాథ్, కరీముల్లా, నాగరాజులను పట్టుకొని విచారించగా గుప్తనిధులకోసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.