అత్తింటి ముందు హాకీ క్రీడాకారిణి ఆందోళన  | husbands family harassing for dowry | Sakshi
Sakshi News home page

అత్తింటి ముందు హాకీ క్రీడాకారిణి ఆందోళన 

Published Sun, Jan 28 2018 7:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

husbands family harassing for dowry - Sakshi

భర్తతో కవిత(ఫైల్‌). అత్తింటి ముందు బైఠాయించిన కవిత 

గుంటూరు రూరల్‌: వివాహమైన 15 రోజులకే తనను వదిలి వెళ్లిన భర్త జాడ చెప్పాలని జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అత్తింటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన శనివారం రాత్రి గుంటూరులో సంచలనం రేపింది. గుంటూరు పండరీపురం 4వ లైన్‌కు చెందిన బసవ కవిత హాకీ క్రీడాకారిణి. ఆమెకు అదే కాలనీకి చెందిన బసవ కిరణ్‌కుమార్‌తో 2016 ఏప్రిల్‌ 19న వివాహం జరిగింది. కిరణ్‌కుమార్‌ అదే సంవత్సరం మే 3న ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు కవిత అత్తమామలతోనే ఉంది. తర్వాత ఐదు నెలల పాటు తమకు వేరే పని ఉందంటూ 1వ లైనులో ఉన్న ఇంట్లో కవితను వదిలివెళ్లారు.

అప్పటి నుంచి అత్తమామల ఆచూకీ కోసం వెతుకుతుండగా నెల రోజుల క్రితం గుంటూరులోనే ఎన్జీవో కాలనీలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లగా నీకూ, మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే న్యూసెన్స్‌ కేసు పెడతామని అత్తమామలు బెదిరించారు. దీంతో కవిత నగరంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సైతం భర్త ఆచూకీ తెలపకపోవడంతో శనివారం రాత్రి అత్తమామల ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి కవితను బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. 

న్యాయం చేయండి: పెళ్లి సమయంలో రూ.50 లక్షలు, 60 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చామని, అయినా అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు డిమాండ్‌ చేస్తున్నారని బాధితురాలు కవిత వాపోయింది. తాను 2010–13 వరకు జాతీయ స్థాయిలో హాకీ ఆడానని, ఎన్నో పతకాలు సాధించానని తెలిపింది. తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని వేడుకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement