రైలు ట్రాక్‌పై రంది నర్సింహులు మృతదేహం
కాశీబుగ్గ: మద్యం అలవాటు ఉన్న భర్తను ఎలాగైనా మార్చాలని ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. అతడిని భయపెట్టమని పోలీసులను ఆశ్రయించింది. అప్పటికైనా మారుతాడని, కుటుంబం చక్కదిద్దుకోవచ్చన్న ఆ అబల ఆలోచన బెడిసికొట్టింది. ఇంటికి పోలీసులు వచ్చారన్న అవమానంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పూరి–తిరుపతి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు తాళ్లభద్ర గ్రామానికి చెందిన రంది నీలయ్య(లేటు) కుమారుడు రంది నర్సింహులు భార్య జయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. నర్సింహులు, జయలక్ష్మి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా వీరి మధ్య గొడవ చోటుచేసుకుంది.
అనంతరం వీరి ఇద్దరు కుమారులు చైతన్య, కిషోర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చదువుకు వెళ్లిపోయారు. జయలక్ష్మి స్థానిక జీడిపరిశ్రమలో కూలీగా పనిచేస్తుండడంతో ఆమె అక్కడికు వెళ్లిపోయింది. అయితే ఆమె అటునుంచి అటు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఉదయం తమ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ విషయం పోలీసులకు తెలిపింది. తన భర్త నిత్యం మద్యం సేవించి గొడవ పడుతున్నాడని, కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని చెప్పింది. అతడిని మందలించి మారేటట్టు చేయాలని కోరింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు పోలీసులు నర్సింహులు ఇంటికి వచ్చి నర్సింహులు గురించి ఆరాతీశారు. ఇదే విషయం గ్రామం మొత్తం వ్యాపించి ఆనోటా ఈనోటా వినడంతో అవమానంగా భావించిన నర్సింహులు పూటుగా మద్యం సేవించి ఆత్మహత్యకు పూనుకున్నాడు.
కళ్లముందే మరణిస్తున్నా చలించని హృదయాలు
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తాళ్లభద్ర రైల్వే గేటువద్దకు వచ్చిన రంది నర్సింహులు గేటు వేసి ఉన్నప్పటికి గేటు కింద నుంచి వెళ్లి పలాస నుంచి బరంపురం వైపు వెళ్తున్న గూడ్సు రైలును పట్టుకోవడానికి యత్నించాడు. రైలు వేగం పుంజుకోవడంతో బయపడి వెనుదిరిగాడు. రెండు చేతులు జోడించి మరలా రైలు పట్టేందుకు ప్రయత్నించి ధైర్యం చాలక విఫలమయ్యాడు. ఇంతలో పూరి నుంచి పలాస వైపు వస్తున్న పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా పట్టాలపై నిల్చున్నాడు. రైలు డ్రైవర్ హార్న్ కొడుతున్నా పట్టించుకోలేదు. రైలుకిందపడి నలిగిపోయాడు. సుమారు 100 మీటర్ల దూరం ఇతడిని రైలు ఈడ్చుకెళ్లింది. ఇదంత చూస్తున్నా గేటువద్ద ఉన్న ప్రయాణికులు కేకలు వేయడం గాని, రక్షించే ప్రయత్నం గాని చేయలేదు. రైలు నిలిపివేయగా కొనప్రాణంతో నర్సింహులు కొట్టుమిట్టాడాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి అత్యవసర వైద్యం అందిస్తుండగా చూస్తూనే ప్రాణాలు విడిచాడు. పలాస జీఆర్‌పీ కె.కోదండరావు ఇన్‌వెస్టిగేషన్ ఆఫీసర్‌గా పరిశీలించి ఆత్మహత్యగా కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment