సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్ పీవీఎన్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్–140 పరిసరాలు ఇంకా భయం గుప్పిట్లోనుంచి తేరుకోలేదు. బుధవారం మధ్యాహ్నం ఇక్కడ రమేశ్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటనతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లు నడిరోడ్డుపై రమేశ్‌ను గొడ్డలితో నరికి చంపిన ఉదంతం వారిని కలచివేసింది. ఈ సంఘటనపై స్థానికులు కొందర్ని సాక్షి మాట్లాడించే ప్రయత్నం చేయగా..వారెవరూ ఇష్టపడలేదు. తాము ఏమీ చూడలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఘటనాస్థలిలో రమేశ్‌ను గొడ్డలితో నరుకుతున్న కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లను నిలువరించబోయిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించ లేదు. అయితే వీరి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారి చిరునామా దొరకబుచ్చుకొని నిందితులను నిలువరించే సాహసం చేసినందుకు సత్కారం చేయాలనుకుంటున్నామని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. నిందితులు కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. గతేడాది డిసెంబర్ 24న మహేష్‌గౌడ్‌ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కిషన్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్‌లు రమేశ్‌ను హతమార్చిన సంగతి తెలిసిందే.
ఘటనాస్థలిలో సాయుధపోలీసుల బృందం...
బుధవారం హత్య జరుగుతుండగానే పెట్రోలింగ్ వెహికల్ వెళ్లినా నిందితులను నిలువరించేందుకు పోలీసుల వద్ద ఆయధాలు లేకపోవడంతో ప్రేక్షకపాత్రను పోషించారనే విమర్శలు వచ్చాయి. దీంతో భద్రత పెంపుపై పోలీసులు దృష్టిసారించారు. ఘటనాస్థలిలోనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాయుధ పోలీసుల బృంద ఇంటర్‌సెప్టర్ వెహికల్‌ను నిలిపి అక్కడే విధులు నిర్వహించడం కనిపించింది. అక్కడే జీహెచ్‌ఎంసీ సహకారంతో నిర్వహిస్తున్న రూ.5 భోజన కేంద్రం వద్ద అన్నం తినేవారు కరవయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ కేంద్రం గురువారం బోసిపోయిందని నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఘటనాజరిగిన సమయంలో మా కేంద్రం తెరవలేదని చెప్పారు.
పోలీసుల అదుపులో మూడో వ్యక్తి..?
రమేశ్ బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టుకు వచ్చి తిరుగు పయనమవుతున్న సమాచారాన్ని నిందితులకు అందించినట్టుగా భావిస్తున్న విక్రమ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి ప్రతి కదలికను నిందితులు కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లకు చేరవేయడంతో పక్కా ప్లాన్‌తోనే అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 వద్ద అంతమొందించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్‌నుఅభినందించిన సైబరాబాద్ సీపీ
అత్తాపూర్‌లో బుధవారం రమేష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో లింగమూర్తిని రివార్డుతో సత్కరించారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులతో పాటు పౌరులు కూడా ముందుకు వచ్చి దుశ్చర్యలను అడ్డుకుంటే నేరాలు అదుపులోకి వస్తాయని సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment