సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(కోఠి మెటర్నిటీ హాస్పిటల్) నుంచి సోమవారం అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభించింది. దాదాపు 28 గంటల పాటు నిర్విరామ గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు మంగళవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని గుర్తించాయి. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం ఉదయానికి హైదరాబాద్ తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఆయాగా పరిచయం.. అపహరణ
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన సుబావతి విజయ కాన్పు కోసం గత నెల 21న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. 27న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో విజయ వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఆయాగా పరిచయం చేసుకుంది. చిన్నారికి వ్యాక్సినేషన్ చేయించాలని చెప్పి తనతో తీసుకెళ్లింది. ఆ మహిళ ఎంతకూ బిడ్డను తీసుకురాకపోవడంతో విజయకు అనుమానం వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పింది.
వారు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత దాదాపు ఒంటి గంట ప్రాంతంలో రెండు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితురాలిని గుర్తించాయి. చిన్నారిని తీసుకెళ్లిన మహిళ కదలికల కోసం ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న 200 సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ చిన్నారితోపాటు ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్లు తేలింది.
సీసీ కెమెరాల ఆధారంగా..
దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మరో రెండు గంటల పాటు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. సదరు కిడ్నాపర్ చిన్నారితోపాటు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ బస్సు ఎక్కుతున్న దృశ్యాలను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తించగలిగారు. ఆ బస్సు ఎక్కడకు వెళ్తుందో తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆర్టీసీ అధికారుల సాయంతో అది బీదర్ బస్సుగా నిర్థారించిన పోలీసులు దాని నంబర్ కోసం ప్రయత్నించారు. వీడియోల్లో స్పష్టంగా లేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో బస్సు నంబర్‌తో పాటు దాని డ్రైవర్ సెల్ నంబర్ సైతం సేకరించగలిగారు. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆ డ్రైవర్‌కు కాల్ చేయగా.. సదరు మహిళ చిన్నారితోపాటు బీదర్ బస్సు స్టేషన్‌లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో దిగిందని, తాము ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నామని చెప్పాడు.
బీదర్‌కు ప్రత్యేక బృందాలు..
ఈ పరిణామాల నేపథ్యంలో ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్ బీదర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడి నుంచీ మూడు ప్రత్యేక బృందాలు బీదర్ బయలుదేరాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు పాప ఫొటోలతో పాటు అనుమానితురాలి సీసీ ఫుటేజ్ తదితరాలను బీదర్ పోలీసులకు పంపారు. వీటి ఆధారంగా బీదర్ పోలీసులు అక్కడి బస్టాండ్ నుంచి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రికి నగరం నుంచి బయలుదేరిన పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు బీదర్ చేరుకున్నాయి. అప్పటికే బీదర్ పోలీసులు సదరు మహిళ చిన్నారితోపాటు బస్టాండ్ పక్కనే ఉన్న మురికివాడలోకి వెళ్లినట్లు సమాచారం సేకరించారు. బీదర్ పోలీసులతో కలసి ప్రత్యేక బృందాలు ఆ మురికివాడలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తమ వద్ద ఉన్న చిన్నారి, అనుమానితురాలి ఫొటోలను ప్రజలకు చూపిస్తూ సమాచారం సేకరించాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. అయితే కిడ్నాపర్ చిన్నారితోపాటు ఆ మురికివాడ నుంచి తప్పించుకుంది.
ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో..
తదుపరి చర్యల్లో భాగంగా మురికివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా మహిళ కదలికలు రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆమే కిడ్నాపర్ అని, చిన్నారితోపాటు ఓ ఆటో ఎక్కుతున్నట్లు గుర్తించారు. మరికొన్ని సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం సదరు మహిళ మూడు ఆటోలు మారినట్లు తేల్చారు. ఆటో నంబర్లు సరిగ్గా కనిపించకపోవడంతో సాంకేతికంగా ప్రయత్నించారు. చివరకు ఐదు ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్లను విచారించారు. ఓ ఆటో డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాను ఓ మహిళను, చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రి సమీపంలో వదిలినట్లు చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. ఓ మహిళ ఒంటి గంటల ప్రాంతంలో పసికందుతో వచ్చిందని, చిన్నారిని వదిలి పారిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తాము పసికందును ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపాయి.
ఫొటోలతో సరిపోల్చి.. తల్లికి చూపించి..
అక్కడకు చేరుకున్న సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన ఐసీయూలో ఉన్న చిన్నారిని ఫొటోలతో పోల్చి కిడ్నాపైన శిశువుగా గుర్తించారు. వీడియో కాల్ ద్వారా నగరంలో ఉన్న తల్లి విజయకు చిన్నారిని చూపించి ఖరారు చేసుకున్నారు. ప్రసుత్తం చిన్నారి అక్కడే చికిత్స పొంkదుతుండటంతో తల్లి విజయను సైతం అక్కడికి తీసుకువెళ్లారు. బుధవారం తల్లీబిడ్డల్ని నగరానికి తీసుకురానున్నారు. మరోవైపు పరారైన కిడ్నాపర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆమె బీదర్‌కు చెందినదా లేదా అక్కడ బంధువులు ఉన్న మహిళై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో లేదా చుట్టు పక్కల ఒకటి రెండు రోజులు కాపుకాసి ఉండచ్చని అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment