పోలీసులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతున్న విశ్వేశ్వరరెడ్డి తదితరులు
సాక్షి, అనంతపురం : కడప పోలీసులపై జేసీ వర్గీయుల దాడి కేసులో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనపై దాడి జరిగిందని సీఐ హమీద్ వాంగ్మూలం ఇచ్చినప్పటికి.. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. రైడ్ చేశాక ఎమ్మెల్యే జేసీతో మాట్లాడాలని నిందితుడు రషీద్ తనకు ఫోన్ ఇచ్చాడని.. అందుకు తాను నిరాకరించటంతో రషీద్ స్వయంగా జేసీతో మాట్లాడి.. ఆయన ఆదేశాలతోనే తనపై దాడి చేశారని సీఐ హమీద్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ వాంగ్మూలాన్ని పోలీసులు పక్కన పెట్టేశారు. కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా జేసీ వర్గీయులకే కేసు పరిమితం చేశారు. సీఐ, కానిస్టేబుళ్లతో మాట్లాడేందుకు మీడియాకు అనుమతులు నిరాకరించారు.
వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి మాట్లాడుతూ.. సీఐ హమీద్ ఖాన్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులపై జరిగిన దాడి ఘటనలోనూ రాజకీయాలు సరికాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగటం సరికాదని హితవుపలికారు. జేసీ వర్గీయుల దాడిలో గాయపడి కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడప పోలీసులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment