నిందితుడి ఊహాచిత్రం
కురబలకోట (చిత్తూరు)/సాక్షి, అమరావతి: సంచలనం రేపిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఊహా చిత్రాన్ని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆదివారం విడుదల చేశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత ఇటీవల చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. కల్యాణ మండపం సీసీ ఫుటేజీలో నిందితుడి ఆకారం స్పష్టంగా కన్పించలేదని డీఎస్పీ చెప్పారు. పెళ్లిలో అతన్ని చూసిన వారు చెప్పిన ఆనవాళ్లతో పాటు ఫుటేజీలోని ఆకారం ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇలాంటి పోలికలున్న వ్యక్తి కనిపిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే, ఫుటేజీలో లభ్యమైన నిందితుడి ఫొటోను కూడా ఆదివారం పోలీసులు పత్రికలకు విడుదల చేశారు.
కఠినశిక్ష పడేలా చూడండి
చిన్నారి హత్య తీవ్రంగా కలచివేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్
చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని చెప్పారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment