సీసీ ఫుటేజీల్లో బాలుడ్ని కిడ్నాప్ చేస్తున్న దృశ్యం.. నిందితుడు, కిడ్నాపైన బాలుడు
సాక్షి, తిరుమల: తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఉదంతంతో టీటీడీ అధికారులు ఉలిక్కి పడ్డారు. ఏడాది క్రితం తిరుమలలో జరిగిన రెండు కిడ్నాప్ ఘటనలు మరువకముందే మహారాష్ట్రకు చెందిన ఏడాదిన్నర వయసున్న వీరేష్ శుక్రవారం అపహరణకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు గురువారం తిరుమలకు వచ్చారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు శ్రీవారి దర్శనం ముగించుకుని విశ్రాంతి గదులు దొరకక పోవడంతో 4.15 గంటలప్పుడు మాధవ నిలయం వద్ద ఉన్న మండపంలో విశ్రాంతి తీసుకున్నారు.
ఉదయం 6.30 నిమిషాల వరకు బాబు నిద్రిస్తూ కనిపించాడని బాలుడి తండ్రి ప్రశాంత్ తెలిపాడు. కాసేపు కునుకు తీసి 7.15 గంటలకు చూడగా బాబు తమ వద్ద లేకపోవడంతో.. గంటల తరబడి వెతికామని లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాలుడి తండ్రి వద్ద నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాబు ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. బాలుడి ఫొటోతో పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తి చిత్రాలున్న పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి బస్సుల్లో అతికించారు.
సీసీ ఫుటేజీలు లభ్యం..
ఈ ఘటనలో బాలుడు తప్పిపోలేదని, ఓ వ్యక్తి వీరేష్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయి. తిరుమలలోని గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు మాధవ నిలయం వద్ద ఉన్న గంగమ్మవారి ఆలయం ముందు సుమారు 42 ఏళ్ల వయస్సున్న వ్యక్తి వీరేష్‌ను అపహరించినట్లు నిర్దారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment