
మీడియాతో మాట్లాడుతోన్న పోలీసులు
ధర్మారం(ధర్మపురి): ఒకరికి బదులు మరొకరు పదో తరగతి పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఖిలావనపర్తి మారుతీ విద్యాలయం పదోతరగతి విద్యార్థులకు మండలంలోని దొంగతుర్తి హైస్కూల్ పరీక్షా కేంద్రం కేటాయించారు. మారుతీ విద్యాలయంలో పదోతరగతి చదువుతున్న కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్ పరీక్షలు రాయాల్సి ఉండగా... వీరికి బదులుగా ఇంటర్ చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్ కేంద్రానికి వచ్చారు.
ప్రశ్నాపత్రం.. ఆన్‌సర్‌షీట్ తీసుకున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి సంతకాలు పరిశీలించారు. తేడాగా కనిపించడంతో నిలదీశారు. దీంతో విద్యార్థులు అసలు విషయం చెప్పారు. పెద్దపల్లి ఏసీపీ హాబీబ్‌ఖాన్, సీఐ నరేందర్ దొంగతుర్తి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. పదో తరగతి విద్యార్థులకు బదలుగా ఇంటర్ విద్యార్థులను ప్రొత్సహించి పరీక్షలు రాయించిన మారుతీ విద్యాలయం కరస్పాండెంట్ కొమురయ్య, విద్యార్థులు కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్, ఇంటర్ విద్యార్థులు మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.