లక్ష్మి (ఫైల్)
కర్ణాటక, కోలారు: కోలారు తాలూకాలోని గద్దె కణ్ణూరుగ్రామంలో ఓ అమ్మాయి గత శనివారం నీటి సంప్‌లో పడి మరణించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దేవరాజ్ కుమార్తె లక్ష్మి(17) అనుమానాస్పదంగా మరణించిన యువతి. యువతి మరణంపై తల్లిదండ్రులు అత్యాచారం, హత్య అని అనుమానం వ్యక్తం చేస్తూ కోలారు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దార్ సమక్షంలో శవాన్ని సంప్ నుంచి బయటకు తీసి మరణోత్తర పరీక్షను నిర్వహించారు.
ఏం జరిగిందంటే
గ్రామానికి చెందిన దేవరాజ్ కుమార్తె లక్ష్మి తాలూకాలోని కెంబోడి జనతా కళాశాలలో ఇంటర్ చదువుతోంది. శనివారం ఎప్పటిలాగానే కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంట్లో పనులు ముగించుకుని తోటకు రావాల్సిందిగా తండ్రి దేవరాజ్ తెలుపగా తాను ఇంట్లోనే ఉంటానని లక్ష్మి తెలిపింది. అనంతరం దేవరాజ్ తోటకు వెళ్లి పోయాడు. అనంతరం మళ్లీ ఇంటికి వచ్చిన సమయంలో కూతురు ఇంట్లో కనిపించలేదు. మునిసిపల్ కొళాయి నుంచి నీరు వదలడంతో దేవరాజ్ నీటిని వదలడానికి సంప్ తెరిచాడు. అందులో కూతురు శవం కనిపించడంతో నిర్ఘాంతపోయాడు. బంధుమిత్రులతో కలిసి ఇంటి సమీపంలోనే ఉన్న తోటలో అంత్య సంస్కారం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
అయితే సోమవారం కోలారు స్లం నివాసి అభి పేరుతో యువతి తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. తాను మీ కూతురిని నేను ప్రేమిస్తున్నానని, ఆమె ఎలా చనిపోయింది? అని ప్రశ్నించాడు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. శనివారం తాము ఇంట్లో లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేసి సంప్‌లో పడేసి హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో మంగళవారం ఉదయం తహశీల్దార్, పోలీసులు స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు. యువతి శవాన్ని తహశీల్దార్ సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం జరిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment