టిఫిన్‌ బాక్స్, కప్పు సాసర్లు మాత్రమే చోరీ | Investigation Speed Up in Nizam Museum Robbery Case hyderabad | Sakshi
Sakshi News home page

ముమ్మర దర్యాప్తు

Published Wed, Sep 5 2018 8:07 AM | Last Updated on Wed, Sep 5 2018 8:40 AM

Investigation Speed Up in Nizam Museum Robbery Case hyderabad - Sakshi

దొంగలు ప్రవేశించిన గ్యాలరీ వెంటిలేటర్‌ సీసీ కెమెరా పుటేజీలో నిందితుల చిత్రాలు చోరీ జరిగిన అల్మారా డ్రా

హైదరాబాద్‌, యాకుత్‌పురా: హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసులో నగరపోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు మంగళవారం మ్యూజియాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో ఉన్న ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖా¯Œన్‌కు సంబంధించిన ఆభరణాలు, బహుమతులు, వస్త్రాలను పరిశీలించారు. మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. వెంటిలేటర్‌ నుంచి నిందితులు లోపలికి చొరబడినట్లు గుర్తించారు. గ్యాలరీలోని విలువైన వస్తువులు ఉన్నప్పటికీ దొంగలు కేవలం వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌ బాక్స్, టీ కప్పు, సాసర్, స్ఫూన్లు మాత్రమే ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చోరీ జరిగింది ఇలా..  
మ్యూజియం ప్రహరీ పక్కనున్న పురాతన ఇనుప మెట్ల మీదుగా దొంగలు లోపలికి వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియం సమీపంలోని గంగానగర్‌ నాలా బస్తీ మీదుగా వచ్చిన దుండగులు మ్యూజియం భవనంపై నుంచి మూడో గ్యాలరీ వెంటిలేటర్‌ను తొలగించి తాడు సహాయంతో లోపలికి దిగినట్లు గోడలపై గుర్తులు ఉన్నాయి. గ్యాలరీలోని అల్మారా డ్రాను రాడ్‌తో తొలగించి అందులో ఉన్న డైమండ్, బంగారు టిఫిన్‌ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్‌లను ఎత్తుకెళ్లారు. అదే డ్రాలో వెండి ప్లేట్, గ్లాస్‌తో పాటు ఇతర వస్తువులున్నప్పటికీ వాటిని ముట్టుకోకపోవడం గమనార్హం.  

సీసీ కెమెరాలో ఇద్దరి ఆనవాళ్లు
పోలీసులు సేకరించిన సీసీ కెమెరాల ఫుటేజీల్లో మ్యూజియం వెనకవైపు ఉన్న బస్తీ నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులిద్దరూ ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఓ వ్యక్తి ట్రావెలింగ్‌ బ్యాగ్‌ భుజానికి వేసుకొని బైక్‌ తీసుకెళుతుండగా, మరో యువకుడు వెనక వెళుతున్నట్లు గుర్తించారు.  

15 బృందాలతో గాలింపు: షికా గోయల్‌.  
నిజాం మ్యూజియంలో చోరీ కేసును చేధించేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర అదనపు కమిషనర్‌ (సిట్‌ అండ్‌ క్రైమ్స్‌) షికా గోయల్‌ తెలిపారు. మంగళవారం ఆమె సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి, ఇన్‌చార్జి డీసీపీ రమేశ్‌ రెడ్డితో కలిసి మ్యూజియాన్ని సందర్శించారు. చోరీ జరిగిన గ్యాలరీని పరిశీలించి మ్యూజియం సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. మ్యూజియంలోని 10 సీసీ కెమెరాలతో పాటు కాలనీల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏడో నిజాంకు చెందిన బహుమతులను మూడు గ్యాలరీల్లో భద్రపరిచామన్నారు. ఇద్దరు వ్యక్తులు చోరీలో పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించామన్నారు. మ్యూ జియం భద్రత పై ట్రస్టు నిర్వాహకులకు సూచనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.  

భద్రతా వైఫల్యమే కారణం...
మ్యూజియానికి ట్రస్టు నిర్వాహకులు సరైన భద్రత కల్పించనందునే చోరీ జరిగిందని నిజాం మునిమనువడు నజఫ్‌ అలీఖాన్‌ అన్నారు. మంగళవారం మ్యూజియాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మ్యూజియంలో ఏడో నిజాంకు వివిధ దేశాల అధినేతలు ఇచ్చిన విలువైన బహుమతులు ఉన్నాయన్నారు. ట్రస్టు నిర్వాహకులు మ్యూజియానికి బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నారు. మ్యూజియం నిర్వహణ సరిగా లేదని, మ్యూ జియంలోకి వెళ్లే చెక్క మె ట్లు శిథిలావస్థకు చేరు కున్నాయని ఆరోపించారు.  
– నిజాం మునిమనవడు నజఫ్‌ అలీ ఖాన్‌

పథకం ప్రకారమేనా..
చార్మినార్‌/యాకుత్‌పురా: నిజాం మ్యూజియంలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ దొంగలు వాటిని కనీసం ముట్టుకోకపోగా, కేవలం టిఫిన్‌ బాక్స్,టీ కప్పు, సాసర్, స్పూన్‌లను మాత్రమే ఎత్తుకెళ్లడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌ బాక్స్‌ను బయటి మార్కెట్‌లో అమ్ముకోలేమని తెలిసినా దానినే తస్కరించడం పట్ల ఎప్పటి నుంచో చోరీకి స్కెచ్‌ వేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వివిధ భవనాల నిర్మాణాల కోసం ఉపయోగించిన వెండి, బంగారంతో చేసిన గంపలు, తాపీలు, పలు పరికరాలు, బంగారంతో తయారు చేసిన సింహాసనం కూడా ఇక్కడే. అత్యంత ఖరీదైన బస్రా ముత్యం కూడా మ్యూజియలో కొలువుదీరినా దొంగలు దానివైపు కూడా చూడలేదు. ఎవరో ముందస్తుగా బేరం కుదుర్చుకున్నట్లుగా వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌ బాక్స్‌ను మాత్రమే తస్కరించారు. పురానాహవేళీలో  2000 ఫిబ్రవరి 18న నిజాం మ్యూజియం ఏర్పాటయినప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి చోరీ జరగలేదు. విదేశీ పర్యాటకులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో  మ్యూజియాన్ని సందర్శిస్తున్నా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement