సాక్షి, ముంబై: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్(50) పేరు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఐపీఎల్ బెట్టింగ్‌తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడైంది. థానే పోలీసుల(ఏఈసీ) నుంచిసమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్‌లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు.
విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫోటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన ఛాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడంట.
డైరీ ఆధారంగానే... ‘బెట్టింగ్‌లో ఓడిపోయిన డబ్బును అర్బాజ్ చెల్లించకపోవటంతో జలన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవసరమైతే ఈ విషయంలో సల్మాన్‌ను నిలదీస్తామని వారు బెదిరించారు’ అని శర్మ మీడియాకు వెల్లడించారు. 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసును దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైప్రొఫైల్ బుకీ జలన్‌తోపాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. గతంలో జరిగిన సీజన్‌లలోనూ జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్‌లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతోపాటు వంద మంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు.
అంతేందుకు ఈ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని సోనూ విచారణలో వెల్లడించాడు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్ సెలబ్రిటీల స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్ తెలిపాడు. అయితే వారందరినీ విచారణ చేపడతారా? అన్న ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదు. ముంబై కమీషనర్ ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, మరో ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడటం గమనార్హం.
స్పందించిన ఐపీఎల్ చైర్మన్... ‘ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలో ఉంది. ఐసీసీ-బీసీసీఐలకు అవినీతి నిరోధక విభాగాలు ఉన్నాయి. అవసరమైతే పోలీసులు ఆయా విభాగాలను సంప్రదించొచ్చు’ అని శుక్లా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment