సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో తవ్విన కొద్ది అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జయరామ్‌ను హత్య చేసిన రోజు ఘటనా స్థలంలో నగేశ్ ఉండటమే కాకుండా హత్యకు సహకరించినట్లు సమాచారం. అలాగే జయరామ్‌ను ట్రాప్ చేసేందుకు అమ్మాయి పేరుతో రాకేష్ రెడ్డితో పాటు నగేశ్ కూడా వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే జయరామ్‌ను బయటకు రప్పించి, కిడ్నాప్ చేయడమే కాకుండా, అతడితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యాయి. ఇప్పటికే నగేశ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ రౌడీ షీటర్ కేసు నమోదైంది. గత కొంతకాలంగా రాకేష్ రెడ్డి...నగేశ్‌తో కలిసి దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. (జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...)
ఇక జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పరిచయమయ్యాక ఆమె ద్వారా రాకేష్‌కు జయరాం స్నేహితుడు అయ్యాడు. ఈ నేపథ్యంలో జయరామ్ ఆస్తిపై కన్నేసిన రాకేష్...ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని భారీ స్కెచ్ వేశాడు. అందుకోసం నగేశ్ సహకారం కూడా తీసుకున్నాడు. పోలీసులు తమ విచారణలో భాగంగా నగేశ్‌తో పాటు సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, చొక్కారామ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. జయరామ్ హత్యకు ముందు, ఆ తర్వాత రాకేష్ రెడ్డి వీరితో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.
మరోవైపు నిందితుడు రాకేష్ రెడ్డి నివాసంలో పోలీసులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10లోని రాకేష్ నివాసంలో పోలీసులు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో నిందితుల వాంగ్ములం నమోదు చేశారు. రాకేష్ రెడ్డి నివాసంతో పాటు, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు రాకేష్ ఇంటికి పలువురు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కృష్ణాజిల్లా నందిగామ టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్‌ను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment