ఫారెస్ట్ గేట్ వద్ద టైర్లు కాల్చివేత, మృతుడు తిరుపతి ప్రధాన్
సాక్షి, పర్లాకిమిడి: స్థానిక పట్టణంలోని సెంచూరియన్ గ్రామ తరంగ్ వద్ద ఉన్న ఓ కల్వర్టును మోటార్‌బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఫారెస్ట్ గేట్ నుంచి కోర్టు జంక్షన్ వరకు కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అదే దారిలో ఇద్దరు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి మోటారుబైక్‌తో వస్తూ అదే దారిలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదే విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని దగ్గరలోని బరంపురం ఆసుపత్రికి తరలించగా, అతడు కూడా మృతి చెందాడు. సంఘటనా స్థలంలో మృతి చెందిన వ్యక్తిని స్థానిక తెల్లిగుడ వీధికి చెందిన జియో మొబైల్ టవర్ సూపర్‌వైజర్ తిరుపతి ప్రధాన్‌గా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో ఇదే కల్వర్టును ఓ ప్రైవేట్‌బస్సు ఢీకొన్న ఘటనలో పూజారి అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాద విషయంపై మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి, స్థానిక ఫారెస్ట్‌గేట్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రహదారి మధ్యలో టైర్లు కాల్చి, అటువైపుగా వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలాస, బరంపురం, హిరమండలం,ఆర్.ఉదయగిరిలనుంచి చ్చిపోయే బస్సులు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి.ప్రమాదానికి కారణమైన రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చెల్లించాలని కోరారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న పోలీసు అధికారి ఠాకుర్ ప్రసాద్, తహసీల్దారు సింహాచలం ప్రధాన్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ లక్ష్మీకాంత పాఢి, సబ్ కలెక్టర్ స్వయంగా వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని సద్దుమణిగించారు.
Comments
Please login to add a commentAdd a comment