సాక్షి, హైదరాబాద్ : ఏదైనా ఓ వివాదంలో ఇతర వ్యక్తుల ప్రయోజనాలు ముడిపడి ఉండి, ఆ ప్రయోజనాలు ప్రభావితమవుతున్నప్పుడు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆ వివాదంలో పార్టీలుగా ఉన్న కొందరి వ్యక్తుల మధ్యే రాజీ కుదర్చడం చట్ట విరుద్ధమని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా ఇతర వ్యక్తుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇద్దరు వ్యక్తుల మధ్యే వివాదాన్ని పరిష్కరిస్తూ లోక్ అదాలత్ జారీ చేసిన ఒప్పంద ఉత్తర్వు (అవార్డ్)ను హైకోర్టు తప్పుపట్టింది. లోక్ అదాలత్ జారీ చేసిన ఆ అవార్డ్‌ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద కృష్ణా జిల్లాకు చెందిన సాయి ఉమా చిట్‌ఫండ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉమా చిట్‌ఫండ్ బాధితుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ పెండింగ్‌లో ఉండగానే, ఆస్తుల జప్తును ఖరారు చేస్తూ కింది కోర్టు 2012లో ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని 2015లో లోక్ అదాలత్‌కు నివేదించింది. ఉమా చిట్‌ఫండ్ తాకట్టుపెట్టిన ఆస్తులను వేలం ద్వారా అమ్మే విషయంలో ఈ కేసులో కాంపిటెంట్ అథారిటీ కమ్ పోలీస్ కమిషనర్‌కు, ఇండియన్ ఓవర్సీస్‌కు మధ్య రాజీ కుదురుస్తూ లోక్ అదాలత్ 2015 డిసెంబర్ 7న ఒప్పంద ఉత్తర్వు (అవార్డ్) జారీ చేసింది.
ఈ అవార్డును సవాలు చేస్తూ ఉమా చిట్‌ఫండ్ బాధితుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద 21 ఆస్తులే తాకట్టులో ఉండగా, 61 ఆస్తులను ఆమ్ముకునేందుకు పోలీసు కమిషనర్ అంగీకరించారని, ఇది పరిధి దాటి వ్యవహరించడమేనన్నారు. తాకట్టుపెట్టిన ఆస్తులు ఉమా రిస్టార్ట్స్ లిమిటెడ్, ఉమామహేశ్వరుడుకు చెందినవని, ఆస్తుల జప్తును ఖరారు చేస్తూ కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కోర్టు అనుమతి లేకుండా వేలం వేయడానికి వీల్లేదన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీస్ కమిషనర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రాజీ కుదుర్చుకున్నారని కోర్టుకు నివేదించారు.
వాదనలు విన్న ధర్మాసనం, జప్తును ఖరారు చేస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను లోక్ అదాలత్ పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ కమిషనర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల మధ్య రాజీ జరిగిందని తేల్చింది. లోక్ అదాలత్ ముందున్న వ్యాజ్యంలో అభ్యర్థన కేవలం జప్తు ఉత్తర్వులకు సంబంధించి మాత్రమేనని, అయితే లోక్ అదాలత్ మరింత ముందుకెళ్లి 61 ఆస్తుల వేలానికి రాజీ కుదురుస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఆస్తులపై ఈ వ్యాజ్యంలో పార్టీలుగా ఉన్న ఇతర వ్యక్తుల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయని, ఆ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా అవార్డ్ జారీ చేయడం చట్ట విరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇతర వ్యక్తులు ముందుకు రానప్పుడు ప్రొసీడింగ్స్‌ను ముగించి, వ్యాజ్యాన్ని తిరిగి హైకోర్టుకు నివేదించాల్సి ఉండాల్సిందని, అయితే ఆ పని లోక్ అదాలత్ చేయలేదంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ లోక్ అదాలత్ అవార్డును రద్దు చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.
అలా రాజీ కుదర్చడం చట్ట విరుద్ధం
Published Fri, Sep 29 2017 8:23 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement