సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన రిషి, నిఖిల్ రెడ్డి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వెంకటగిరి ప్రాంతానికి చెందిన మోడల్ (21) శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. వారిపై ఈనెల 7న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోగా, తనదే తప్పన్నట్టుగా చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుతో విసిగిపోయి మీడియా ఎదుటకు వచ్చినట్టు ఆమె వెల్లడించారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మోడలే తమ కుమారులను ట్రాప్ చేసిందని రిషి, నిఖిల్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
(చదవండి : మోడల్‌పై లైంగిక దాడి)
డబ్బులు డిమాండ్ చేసింది..
రిషి, నిఖిల్‌రెడ్డిని మోడలే ట్రాప్ చేసిందని రిషి తల్లి ఆదిలక్ష్మీ, నిఖిల్‌రెడ్డి తల్లి సునీత వాపోయారు. తప్పుడు కేసు పెట్టి రూ.20 లక్షలు డిమాండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆడపిల్ల కదా అని కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. మగ పిల్లలను ట్రాఫ్ చేసి బెదిరింపులకు పాల్పడితే...ఆడపిల్లలపై కేసులు, చట్ట ప్రకారం చర్యలు ఉండవా. మా కుమారులు ఎలాంటి తప్పు చేయలేదు. తప్పంతా మోడల్‌దే’అని వారు మీడియాతో అన్నారు.
మోడల్ తన కొడుకుతో పెళ్లికి కూడా సిద్ధపడిందని రిషి తల్లి ఆదిలక్ష్మీ తెలిపారు. ‘మైనర్‌తో వివాహం కుదరదు అని చెప్పా. రెండేళ్ల తర్వాత రిషి మేజర్ అవుతాడు. అప్పుడు మీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేస్తామని కూడా చెప్పాం. తన కొడుకు తప్పు చేశాడని తేలితే ఏ శిక్ష విధించినా అడ్డు చెప్పం. మోడల్ మా అబ్బాయిని ఎలా ట్రాప్ చేసిందో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏసీపీకి ఫిర్యాదు చేస్తాం. డబ్బు కోసం మోడల్ తల్లిదండ్రులు కూడా దిగజారారు. వారు కూడా 10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారు’అని రిషి తల్లి వెల్లడించారు.
నిందితులను అదుపులోకి తీసుకున్నాం : ఏసీపీ కేఎస్ రావు
జూబ్లీహిల్స్ మోడల్‌పై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. జనవరి 7న బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులను విచారించి చర్యలు తీసుకుంటాం. కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేయలేదు. ఐపీసీ సెక్షన్ 376 కింద నిందితులపై కేసు నమోదు చేశాం. నిందితుల తరపువారు చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటాం.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి : బాధితురాలు (మోడల్)
ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో నాకు న్యాయం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలి. మహిళలకు అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment