విహార యాత్ర.. విషాదఘోష | Karnataka JDS Leaders Died in Sri Lanka Bomb Blast | Sakshi
Sakshi News home page

విహార యాత్ర.. విషాదఘోష

Published Tue, Apr 23 2019 11:46 AM | Last Updated on Tue, Apr 23 2019 11:46 AM

Karnataka JDS Leaders Died in Sri Lanka Bomb Blast - Sakshi

శ్రీలంకలో షాంగ్రిలా హోటల్‌లో తుమకూరు, బెంగళూరురూరల్‌ప్రాంతవాసులు. వీరిలో మృతులు.. 1వ నంబరు: రమేష్‌గౌడ, 2: రంగప్ప, 3: హనుమంతరాయప్ప. మిగతవారిలో కొందరు మిస్సయారు

విహారయాత్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విదేశంలో కులాసాగా గడిపివద్దామని బయల్దేరి మిత్రబృందం అదే చివరియాత్రగామారుతుందనుకోలేదు.  మృతులు: కేజీ హనుమంతరాయప్ప, రమేశ్‌ గౌడ, కేఎం లక్ష్మీనారాయణ, శివణ్ణ, రంగప్పమిస్సయినవారు: . మారేగౌడ, పుట్టరాజు 

సాక్షి బెంగళూరు/తుమకూరు/ దొడ్డబళ్లాపురం:   శ్రీలంకలో బాంబు పేలుళ్లలో బెంగళూరు, తుమకూరు ప్రాంతాలకు చెందిన ఐదుగురు జేడీఎస్‌ నాయకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఆచూకీ తెలియడం లేదు. కర్ణాటకలో ఎన్నికలప్రచారం అనంతరం జేడీఎస్‌ నేతలు  శ్రీలంకకు వెళ్లారు. రాజధాని కొలొంబోలో ని  షాంగ్రి లా హోటల్‌లో రెండుగదుల్లో బస చేసినట్లు సమాచారం. 21వ తేదీన ఆ హోటల్లో పేలుడు సంభవించాయి. 

తుమకూరులో విషాదం  
తుమకూరు నగరంలో సరస్వతిపురంలో నివసిస్తున్న జేడీఎస్‌ పార్టీ నేత రమేశ్‌గౌడ (48) పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ఎన్నికలు ముగియగానే  కొందరు స్నేహితులు, జేడీఎస్‌ నేతలతో కలసి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. షాంగ్రి లా హోటల్లో పేలుడుకు బలయ్యారు. రమేశ్‌గౌడ మృతి చెందినుట్ల ప్రసార మాధ్యమాల్లో వార్తలతో భార్య మంజుళ పిల్లలు దిశ, శోభిత్‌లు కన్నీరుమున్నీరుగా విలపించారు.నగర జేడీఎస్‌ నేతలతో పాటు ఇతరపార్టీల నేతలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. జేడీఎస్‌ నేతలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే జ్యోతిగణేశ్‌ రమేశ్‌గౌడ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బెంగళూరు రూరల్‌లో నలుగురు  
బెంగళూరు ఉత్తర తాలూకా అడకిమారనహళ్లికి చెందిన మారేగౌడ, హారోక్యాతనహళ్లి పుట్టరాజు, నెలమంగల తాలూకా గోవేనహళ్లి గ్రామం నివాసి శివణ్ణ, కాచనహళ్లి గ్రామం నివాసి మునియప్ప, లక్ష్మినారాయణ, బెంగళూరు 8వ మైలు హనుమంతరాయప్పలు శ్రీలంక టూర్‌కి వెళ్లారు. షాంగ్రిలాలో హోటల్‌లో మకాం వేశారు. పేలుడు ఘటనలో హనుమంతరాయప్ప, లక్ష్మినారాయణ, మునియప్ప, శివణ్ణ మృతి చెందారని తెలిసింది. మారేగౌడ, పుట్టరాజుల ఆచూకీ తెలియడం లేదు. సోమ వారం మాజీ సీఎం వీరప్ప మొయిలీ, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి, ఇతర జేడీఎస్‌ నేతలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఇ.కృష్ణప్ప, ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి, జేడీఎస్‌ నాయకులు తిమ్మరాయ ప్ప, మృతుల కుటుంబ సభ్యులు మొత్తం 8 మంది శ్రీలంక బయలుదేరి వెళ్లారు.

ఉపరాష్ట్రపతి ఖండన  
శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబు దాడులను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల నిర్మూలనకు అందరు ఏకం కావాలని సోమవారం బెంగళూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో ఉన్న చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఉగ్రవాదుల దాడులతో ఏ దేశమూ సురక్షితంగా ఉండబోదన్నారు.  

దేవెగౌడ, కుమారస్వామి ఆవేదన
కొలంబోలో అదృశ్యమైన భారతీయులు సురక్షితంగా తిరిగి రావాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. బాంబు పేలుళ్లలో సుమారు 300 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. జేడీఎస్‌ నేతల మృతిపై సీఎం కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని , గల్లంతైన నేతల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలకు సీనియర్‌ ఐఏఎస్‌ అంజుమ్‌ ఫర్వేజ్‌ను నోడల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు.   

రమేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీఎం
తుమకూరు : శ్రీలంక రాజధానిలో సంభవించిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన జేడీఎస్‌ నేత రమేశ్‌గౌడ కుటుంబ సభ్యులను ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్‌ పరామర్శించారు. రమేశ్‌గౌడ మరణం తమను కలచివేసిందని రమేశ్‌గౌడ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే జ్యోతిగణేశ్‌ మాట్లాడుతూ... రమేశ్, తాను కళాశాల స్నేహితులమని, శ్రీలంక పేలుళ్లలో తాన ఆప్తుడిని కోల్పోవడం తీవ్రంగా బాధిస్తోందన్నారు. రమేశ్‌ మృతి వార్తతో రమేశ్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల రోదనలతో సరస్వతీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement