సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక పోలీసు అధికారులు మన రాజధానిపై కన్నేశారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు, బీదర్‌లో జరిగిన నేరాల్లో నిందితులు, హతుడి కోసం ఇక్కడ ఆరా తీస్తున్నారు. బెంగళూరులోని మార్తహళ్లి ఠాణా పరిధి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్‌నకు యత్నించిన నిందితులు, బీదర్ జిల్లాలోని మన్నెకిళ్లిలో చోటు చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసులను ఛేదించడానికి అక్కడి పోలీసులు ఇప్పటికే రెండుసార్లు ఇక్కడికి వచ్చి వెళ్లారు. ఓ కేసులో స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటుండగా, మరోదాంట్లో వాళ్లే నేరుగా గాలిస్తున్నారు.
కారులో హెల్మెట్లతో వచ్చి మరీ..
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనురాగ్‌వర్మ బెంగళూరులోని మార్తహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న యమలూర్‌లో నివసిస్తూ సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం ఇండోర్‌కే చెందిన యువతితో నిశ్చితార్థమైంది. ఆపై కొన్నాళ్లకు వీరి మధ్య స్పర్థలు వచ్చాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 11 ఉదయం కార్యాలయానికి వెళ్తున్న అనురాగ్‌పై కిడ్నాప్ యత్నం జరిగింది. హెల్మెట్లు ధరించి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనురాగ్ తలకు తుపాకీ గురిపెట్టి కారులోకి ఎక్కాలని బలవంతం చేయగా అప్రమత్తమైన అనురాగ్ పెద్దగా అరవడంతో పాటు పెనుగులాడాడు. ఫలితంగా అతడి సెల్‌ఫోన్ కారులో పడిపోగా.. ఇద్దరు దుండగులు అందులో ఉడాయించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు మార్తహళ్లి ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు నేపథ్యంలో నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్టు తేల్చారు. దీంతో వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రాజస్థాన్, ఇండోర్‌తో పాటు నగరంలోను ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఇక్కడి ఆటో కావడంతో...
సిటీలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు పొరుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల దర్యాప్తులోనూ ఉపయుక్తంగా మారుతున్నాయి. బీదర్ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసును ఛేదించడానికి అక్కడి పోలీసులు సైబరాబాద్ అధికారులను కలిసి తమకు నిర్ణీత ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఇప్పించాలని కోరారు. వారికి సహకరించిన ఇక్కడి పోలీసులు ఆ కేసు దర్యాప్తుతో పాటు నిందితులు, హతుడి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న పద్మావతినగర్ నుంచి ఈ నెల 10న ఓ ఆటో చోరీకి గురైంది. ఇది కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న చరక్‌పల్లి ఠాణా పరిధిలోని ఓ కల్లుకాంపౌండ్ సమీపంలో దొరికింది. కేసు నమోదు తర్వాత రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా అక్కడి పోలీసులు ఇక్కడి బాధితుడికి సమాచారం ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా వివిధ చెక్‌పోస్టుల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తి ఉన్న ఆనవాళ్లు దొరికాయి. ఇదిలా ఉండగా.. చరక్‌పల్లికి సమీపంలో ఉన్న మన్నెకిళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న దీన్ని గుర్తించడం కష్టంగా మారింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి మిస్సింగ్ కేసులు లేకపోవడంతో ఈ ఆటోతో ఆ మృతదేహానికి లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఆటోను తస్కరించిన చోరులు దొరకాల్సి ఉంది. దీనికోసం సిటీకి వచ్చిన చరక్‌పల్లి పోలీసులు స్థానిక అధికారుల సాయంతో పద్మావతినగర్‌లో దర్యాప్తు చేశారు. ఆటో చోరీకి గురైన ప్రాంతంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment