రెండేళ్ల నరకం తర్వాత... | Kerala Mother Confines Daughter Anjali Prakash for Two Years | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 14 2018 2:54 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

Kerala Mother Confines Daughter Anjali Prakash for Two Years - Sakshi

వేరే మతానికి చెందిన యువకుడితో సన్నిహితంగా ఉందన్న కారణంతో కన్నకూతురితో కర్కశంగా ప్రవర్తించిందో తల్లి. రెండేళ్లుగా నానా హింసలకు గురి చేయగా.. చివరాఖరికి ఓ వీడియో సందేశం ఆ యువతికి విముక్తి లంభించింది. కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే...

సాక్షి, తిరువనంతపురం: త్రిస్సూర్‌కు చెందిన అంజలి పాటిల్‌(26) తండ్రి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. పొరుగున ఉండే ఓ ముస్లిం యువకుడు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అంజలికి ఆ యువకుడికి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పారు. అయితే అంజలి తల్లి మాత్రం అందుకు ససేమిరా చెప్పింది. చివరకు అంజలి మామలు, అత్త సాయంతో ఆమెను బంధించి హింసించసాగింది. 

పిచ్చాసుపత్రిలో చేర్చి మరీ... ఆగష్టు 17, 2016 నుంచి అంజలిని ఆమె తల్లి వినీత ఇంట్లో బంధించింది.  ఆ తర్వాత ఆరెస్సెస్‌, వీహెచ్‌పీకి చెందిన కొందరు వ్యక్తుల సాయంతో ఆమెను ఇతర ప్రాంతాలకు తరలించి మరీ హింసించారు. తొలుత ఆమెపై దాడి చేసిన కుటుంబ సభ్యులు.. ఎర్నాకులం, ఎడపల్లిలోని అమృత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు ఆమెను తరలించారు. అక్కడ డాక్టర్‌ దినేశ్‌ సాయం తీసుకుని ఆమెను మానసిక వ్యాధి పెషెంట్‌గా చిత్రీకరించే యత్నం చేశారు. డ్రగ్స్‌ ఎక్కించి మరీ 45 రోజులపాటు కరెంట్‌ షాక్‌ ఇవ్వటంతో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. ఆ తర్వాత ఆమెను బీజేపీ, వీహెచ్‌పీ నేతలకు చెందిన ఇళ్లకు మార్చి మార్చి వేధింపులకు గురి చేశారు. చివరాఖరికి మంగళూర్‌లోని ఓ వీహెచ్‌పీ నేత ఇంటికి ఆమెను తరలించి, అక్కడే ఆమెను బంధించారు. చివరాఖరికి ఓ పిల్లాడి ద్వారా ఫోన్‌ తెప్పించుకున్న ఆమె ఓ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రయత్నంలో ఆమె స్నేహితుడు కూడా ఆమెకు సాయపడటం విశేషం. 

సెర్చ్‌ ఆపరేషన్‌.. ఫేస్‌ బుక్ వీడియో వైరల్‌ కావటంతో మంగళూర్‌ మహిళా పోలీసు విభాగం రంగంలోకి దిగింది. మే 1 నుంచి 22 రోజులపాటు ఏకధాటిగా వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చివరాఖరికి ఆమెను రక్షించిన పోలీసులు విముక్తి కల్పించారు. కోర్టు ఆదేశాల మేరకు అంజలిని ఆమె అత్త  ఇంటికి పంపించారు.  

తల్లి వేధింపులపై... ‘పరాయి మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు నా తల్లి రాక్షసిలా మారిపోయింది. రెండేళ్లుగా నన్ను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. డ్రగ్స్‌ ఇచ్చి, రోజుకు పది రకాల ఇంజెక్షన్లు ఇచ్చి నన్ను నిద్రపుచ్చేవారు. డాక్టర్‌ దినేశ్‌ వెనుక పెద్ద ముఠా నడుస్తోంది. నాలాగా వేరే మతానికి చెందిన  యువతులు అక్కడ చాలా మంది ఉన్నారు. వారందరికీ హెవీగా డ్రగ్స్‌​ ఇచ్చి, కరెంట్‌ షాకిచ్చే వారు.  ఎవరెవరో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కొందరైతే అత్యాచారయత్నానికి కూడా గురి చేశారు. నా తల్లిలాంటి వాళ్లు ఉండకూడదనే దేవుడ్ని ప్రార్థిస్తున్నా. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. నా స్నేహితుడితో కొత్త జీవితం ప్రారంభిస్తా’ అని అంజలి తెలిపారు.

సీఎంకు ఫిర్యాదు... ఈ వ్యహారంపై కేరళ డీజీపీని కలిసిన(మే 28వ తేదీ) అంజలి.. సీబీ-సీఐబీ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత సీఎం పినరయి విజయన్‌కు కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సీఎం కార్యాలయం ఈ ఘటనపై ఇంతదాకా స్పందించలేదు. మరోవైపు గురువాయర్‌ పోలీసులు ఆమె ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించగా, కోర్టు జోక్యంతో కేసు నమోదు చేశారు.  మంగళూర్‌లోనూ ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు కేరళ డీజీపీ కార్యాలయం పేర్కొంది.  మొత్తం 14 మంది నిందితులపై కేసు నమోదు కాగా, ఏ-1గా అంజలి తల్లి వినీత, అంజలి మావయ్యలు, అత్త, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, మరో ముగ్గురు వీహెచ్‌పీ కార్యకర్తలు, డాక్టర్‌ దినేశ్‌ తదితరుల పేర్లను నిందితులుగా చేర్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement