ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో... | Kidnap sensation at Shamshabad airport | Sakshi
Sakshi News home page

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

Published Sat, Aug 3 2019 2:15 AM | Last Updated on Sat, Aug 3 2019 5:24 AM

Kidnap sensation at Shamshabad airport - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

శంషాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కిడ్నాప్‌ కలకలం చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ప్రయాణికులను ఎక్కించుకుని అనుమానాస్పదంగా వెళ్లిన కారును కుటుంబసభ్యులు వెంబడించి అడ్డుకున్నారు. ముంబైకి చెందిన శ్రీనాథ్, అతని కుటుంబసభ్యులు నగరంలో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని కలవడానికి ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. రెండు ఓలా క్యాబ్‌లను బుక్‌ చేసుకున్నారు. ముందుగా వచ్చిన ఓలా క్యాబ్‌లో శ్రీనాథ్, అతడి భార్య, మరొకరు కూర్చున్నారు. వీరి కుటుంబంలోని యువతితోపాటు బాలిక, బాలుడు మరో ఓలా క్యాబ్‌ కోసం బస్టాప్‌ వద్ద వేచి ఉన్నారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు డ్రైవర్‌.. ఓలా క్యాబ్‌ అని చెప్పి వారిని ఎక్కించుకున్నాడు.

క్యాబ్‌ ముందుకెళుతున్న సమయంలో ఓటీపీ చెబుతానని యువతి అనడంతో అక్కర్లేదని క్యాబ్‌ డ్రైవర్‌ తిరస్కరించాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులోకి అతడి స్నేహితుడు ఎక్కాడు. యువతి అనుమానించి కారును నెమ్మదిగా తీసుకెళ్లమని చెప్పినా డ్రైవర్‌ వినిపించుకోకుండా వేగం పెంచాడు. ఆమె వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి డ్రైవర్‌ తీరు అనుమానాస్పదంగా ఉందని అప్రమత్తం చేసింది. దీంతో వారు ఆ కారును వెంబడించి ఓవర్‌ టేక్‌ చేశారు.

ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద కారును ఆపి యువతితోపాటు బాలిక, బాలుడిని అందులో నుంచి దించారు. అయితే, డ్రైవర్‌ పరార్‌ కాగా కారులో ఉన్న అతడి స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌నకు యత్నించిన కారు డ్రైవర్‌ రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన కిషన్‌ అని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement