సాక్షి, వినుకొండటౌన్: అర్ధరాత్రి వేళ ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడుతున్న నిందితులను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం శృంగారపురంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో నివసించే షేక్ బాషా, పోలం పోలయ్య వరుసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. వారిద్దరూ పట్టణంలోని ముట్లకుంట కాలనీ, శృంగారపురంలోని ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను అపహరించుకుపోయి అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. పొట్టకూటి కోసం పగలంతా కాయకష్టం చేసిన తల్లిదండ్రులు అలసిపోయి అర్ధరాత్రివేళ గాఢనిద్రలో ఉన్న సమయంలో నిందితులు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
పట్టుబడింది ఇలా...
ముట్లకుంట కాలనీకి చెందిన మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక (8)ను పది రోజుల క్రితం అపహరించిన నిందితులు అత్యాచారానికి యత్నించినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. బాషా, పోలయ్య శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అదే కాలనీలోని మరో బాలికను అపహరించే ప్రయత్నం చేయగా, గుర్తించిన తల్లిదండ్రులు, బాలిక కేకలు వేశారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. అదే క్రమంలో శృంగారపురంలోని 12 ఏళ్ల మరో బాలికను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, బాలిక నాయనమ్మ గుర్తించి కేకలు వేయటంతో పరారయ్యారని స్థానికులు తెలిపారు. మరికొద్దిసేపటికే మరో వీధిలో నివాసం ఉండే 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లే ప్రయత్నంలో నిందితులు పట్టుబడ్డారు. తొలుత బాలిక అనుకుని బాలుడిని తీసుకెళ్లబోయారు. గుర్తించి మళ్లీ బాలికను అపహరించే యత్నం చేయగా కుటుంబీకులు గుర్తించారు. కుటుంబసభ్యులు, స్థానికులంతా అక్కడికి చేరుకొని గాలించగా, పాఠశాల వద్ద నక్కి ఉన్న వీరిని గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే ముట్లకుంట కాలనీ వాసులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. బాలికలు నిందితులను గుర్తించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో బాషా పాత నేరస్తుడని, గతంలో దొంగతనం కేసులో ఇతనికి శిక్ష పడిందని పోలీసులు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు.
అర్ధరాత్రి బాలికల కిడ్నాప్.. ఆపై అత్యాచారయత్నం
Published Sun, Dec 3 2017 3:03 AM | Last Updated on Sun, Dec 3 2017 3:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment