ప్రేమపై పెద్దల కత్తి | Knife Attack on Love Marriage Couple in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమపై పెద్దల కత్తి

Published Sat, Jun 8 2019 8:06 AM | Last Updated on Fri, Jun 21 2019 7:16 PM

Knife Attack on Love Marriage Couple in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రితో పాటు బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అడ్డగించి విచక్షణా రహితంగా దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంతియాజ్‌ (21) నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇతడికి సమీప బంధువైన బోరబండకు చెందిన సయ్యద్‌ అలీ కుమార్తె సయ్యద్‌ జైన్‌ ఫాతిమాతో (19) మూడేళ్ల క్రితం పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో వారు తరచూ కలుసుకునేవారు. వివాహం చేసుకోవాలని భావించిన వీరు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వీరి పెళ్లికి ఫాతిమా తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ బుధవారం తల్లిదండ్రులు ఎస్సాఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఫాతిమాను ఇంతియాజ్‌ తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్న ఆమె కుటుంబసభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా ఫాతిమా, ఇంతియాజ్‌లు గురువారం సదాశివపేటలోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు.

అనంతరం ఫాతిమా తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలంటూ   సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి విషయం ఫాతిమా తల్లిదండ్రులకు తెలిసింది. దూర బంధువు అయినప్పటికీ అంతస్తుల్లో ఉన్న తేడాతో ఇంతియాజ్‌తో ఫాతిమా వివాహం జరగడం వారికి నచ్చలేదు. దీంతో ఆమె కుటుంబీకులు, సమీప బంధువులు యువకుడిపై కక్ష పెంచుకున్నారు. ఫాతిమాను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఇంతియాజ్‌ నుంచి దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. బోరబండలో ఉండే ఇంతియాజ్‌ సమీప బంధువు ద్వారా అతడి తల్లిదండ్రులు షేక్‌ రహమతుల్లా, రహీమాలకు ఫోన్‌ చేయించారు. ‘పిల్లలు ఎలాగూ వివాహం చేసుకున్నారు కదా... ఇంటికి తీసుకొస్తే  సంప్రదాయ ప్రకారం నిర్వహించే అన్ని కార్యక్రమాలు పూర్తి చేద్దామం’టూ చెప్పారు.

ఈ విషయాలను వాళ్లు నమ్మకపోవడంతో కనీసం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని సూచించారు. దీంతో గురువారమే నవ దంపతులు ఇద్దరు తమ తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి ఎస్సార్‌నగర్‌ ఠాణాకు వచ్చారు. తమకు రక్షణ కావాలని పోలీసుల్ని కోరడంతో అధికారులు శుక్రవారం ఇరు కుటుంబాలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇకపై అందరం కలిసి ఉంటామని వారు చెప్పడంతో పంపించారు. అప్పటికే నవ దంపతులపై దాడి చేయాలని కుట్ర పన్నిన ఫాతిమా తండ్రి సయ్యద్‌ అలీ తన ముగ్గురు కొడుకులు, అల్లుడితో విషయం చెప్పాడు. అంతా కలిసి ఆటోలో ఆయుధాలను దాచుకుని ఠాణా వద్దకు వచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం తమ క్వాలిస్‌ వాహనంలో వెళ్తున్న ఇంతియాజ్‌ కుటుంబీకులు, స్నేహితుల్ని ఆటోలో వెంబడించారు. ఎస్సార్‌నగర్‌ మెట్రో రైలు స్టేషన్‌ సమీపంలో కారు యూటర్న్‌ తీసుకుంటుండగా నడిరోడ్డుపై ఆటోను అడ్డంగా పెట్టి కారును నిలిపేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి ఇంతియాజ్‌ను బయటకు లాగి కోళ్లు కోసే కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఫాతిమా తన చెయ్యి అడ్డంగా పెట్టడంతో కత్తి ఆమెకు బలంగా తగిలి రెండు చేతి వేళ్లు తెగిపోయాయి. ఓ దశలో ఇంతియాజ్‌ కారు దిగి వెళ్లే ప్రయత్నం చేయగా...  నడిరోడ్డుపై పట్టుకొని మరోసారి దాడి చేశారు. ఈ ఘాతుకం అనంతరం నిందితులు అక్కడి నుంచి ఆటోలోనే పరారయ్యారు. తీవ్ర గాయాలైన నవ దంపతుల్ని పోలీసులు అమీర్‌పేట ప్రైమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఇంతియాజ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే దాడి జరిగిందని ఇంతియాజ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు.

ప్రేమే నేరమా?

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమే నేరమవుతోంది. ప్రేమ జంటలపైకి పెద్దల కత్తి దూసుకుపోతోంది. ఈ రక్కసికి నవ దంపతుల నుంచి వివాహమై ఏళ్లు గడిచిన వాళ్లూ బలవుతున్నారు. నడిరోడ్డుపై పట్టపగలు జరుగుతున్న ఈ దారుణాలను నిరోధించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఘటనలు జరిగేప్పుడు అక్కడే ఉంటున్న వారు సైతం అడ్డుకోకపోగా, వీడియోలు తీయడానికి పరిమితమవుతున్నారు. ప్రస్తుత సమాజంలో పరిచయాలు కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నాయి. అయితే ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబీకులు ప్రేమ పెళ్లిళ్లకు ఒప్పుకోకపోవడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రేమికులు, ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై అయితే కులం లేదా ‘ధనం’ ఏదో ఒకటి కత్తి దూసేలా చేస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలు, ఆర్థిక స్థితిలో వ్యత్యాసమున్న వారిని వివాహం చేసుకున్న వారిపై దాడులు చేయడం, హత్యల వరకు వెళ్లడం జరుగుతోంది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యకు కులం కారణమైతే... తాజాగా ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఘాతుకానికి ధనం కారణమైంది. అన్ని వర్గాల్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక అసమానతల కంటే కులం తేడాల వల్లే 90 శాతం ఈ తరహా నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరువు హత్యలు, దాడులు తరచూ చోటుచేసుకోవడం వెనుక ఇటు పిల్లలు, అటు పెద్దలు ఇద్దరీ తప్పూ ఉంటోందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ప్రేమించడం తప్పు కాదు. అయితే ఆ విషయాన్ని పెద్దలకు వివరించి, తాను ఫలానా వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం పొరపాటు కాదని సర్దిచెప్పడంలో యువత విఫలమవుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పెద్దలకు తెలియకుండా వివాహాలు చేసుకుంటూ వారికి మరింత దూరమవుతోంది. ఈ సమయంలో విచక్షణ కోల్పోతున్న పెద్దలు పరువు హత్యలు/దాడులకు పాల్పడుతున్నారు.  

మానవత్వం మరిచి...  
ఎస్సార్‌నగర్‌ పరిధిలో ఘటన జరిగినప్పుడు అక్కడున్న వారు చేష్టలూడిగి చూస్తూ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారే తప్ప స్పందించలేదు. క్వాలిస్‌లో వెళ్తున్న వారిని ఆటోలో వచ్చిన నిందితులు నడిరోడ్డుపై అడ్డగించి దాడి చేయగా.. ఒక్కరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఏ ఒక్కరూ ముందుకు రాకుండా వెనుకే ఉంటూ తమ సెల్‌ఫోన్లు తీసి ఈ దారుణాన్ని చిత్రీకరించడం మొదలెట్టారు. ఆ ఘాతుకాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకించి షేర్‌ చేసుకున్నారే తప్ప అంతా కలిసి కట్టడిగా నిందితుల్ని అడ్డుకునే/పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీటి ప్రచారం, ముద్రణ వద్దంటూ మీడియాకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.  

ఎన్నో దారుణాలు...   
2018 సెప్టెంబర్‌ 19: కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న సందీప్‌తో పాటు అతడి భార్య మాధవిపై ఆమె తండ్రి మనోహరచారి దారుణంగా దాడి చేశాడు. కొత్త వస్త్రాలు కొనిపెడతానంటూ ఎస్సార్‌నగర్‌ పరిధిలోని గోకుల్‌ థియేటర్‌ వద్దకు రప్పించాడు. ఆపై అల్లుడిపై పట్ట పగలు విచక్షణా రహితంగా దాడికి దిగాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాధవికీ తీవ్ర గాయాలయ్యాయి.  
2018 ఆగస్టు 23: అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ఎల్లంకి సురేష్, విజయలక్ష్మి 2014లో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. భద్రాచలంలో ఉంటున్న వీరు సురేష్‌ తల్లి మృతి చెందడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు. ఎప్పటి నుంచో కక్షకట్టి కాపుకాసిన విజయలక్ష్మి కుటుంబీకులు ఆమెపై దాడి చేసి హతమార్చారు. అప్పటికే వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉండగా.. విజయలక్ష్మి ఏడు నెలల గర్భిణి.  
2017 మే 2: భువనగిరి నుంచి అదృశ్యమైన అంబోజు నరేష్‌ దారుణహత్యకు గురైనట్లు తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి మరో సమీప బంధువు నల్ల సత్తిరెడ్డితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. స్వాతి సైతం అదే నెల 16న తన పుట్టింట్లో బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  
2007 జూలై 24: బోరబండకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ గీతను ప్రేమ వివాహం చేసుకున్న సంగమేశ్వర్‌ హఠాత్తుగా అదృశ్యమై హతమయ్యాడు. ఈ కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గీత సోదరుడు వి.వెంకటేశ్వర్‌రెడ్డి చేయించిన కిరాయి హత్యగా తేల్చారు. రూ.6.5 లక్షలకు సుపారీ ఇచ్చిన ఇతగాడు మరో ఐదుగురితో చంపించాడు.  
ఇవి కేవలం సంచలనం సృష్టించిన ఘటనల్లో కొన్ని మాత్రమే. పెద్దగా ప్రాచుర్యం పొందని దారుణాలు సిటీతో పాటు శివార్లలోనూ అనేకం చోటు చేసుకున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement