ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా (మక్కా) యాత్ర చేయాలనే కోరిక ప్రతి ముస్లింకు ఉంటుంది. అయితే ఖర్చుతో కూడుకుంది కావడంతో స్థోమత కలిగిన వారే ఉమ్రా, హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇటీవల ఒక ట్రావెల్ ఏజెంట్ రూ. 14 వేలకే ఉమ్రా యాత్ర చేయిస్తానని ప్రకటించడంతో ఎక్కువ మంది ముస్లింలు డబ్బు చెల్లించారు.ఇంత తక్కువ డబ్బుతో ఎలా ఉమ్రాకు తీసుకెళ్తారని చాలా మందిలో సందేహం రావడంతో వారిలో నమ్మకం కలిగించడానికి ఏజెంట్ ఒక బ్యాచ్‌ను తీసుకెళ్లాడు. చివరకు ఉమ్రా పేరుతో డబ్బువసూలు చేసుకొని పవిత్ర రంజాన్ మాసంలో అతను పాపానికి ఒడిగట్టాడు.
నమ్మకం కలిగించి.. దోచుకొన్న ఏజెంట్
కడపకు చెందిన ఆలీ అనే వ్యక్తి ఒక పార్టీకి జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలోనే అతను కేఎస్‌ఎస్ పేరుతో ట్రావెల్స్‌ను ఏర్పాటు చేశాడు. కడపలో హెడ్‌ఆఫీసును ఏర్పాటు చేసుకొని ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపురం, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను తెరిచాడు. ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున ఏజెంట్లను నియమించుకున్నాడు. అన్ని చోట్ల రూ. 14 వేలకే ఉమ్రాకు పంపిస్తామని ఫ్లైక్సీలను ఏర్పాటు చేశాడు. కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశాడు. ఉమ్రా యాత్రకు ట్రావెల్స్ నిర్వాహకులు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటారు. ఇంత తక్కువ డబ్బుతో ఎలా పంపిస్తారని అడిగిన వారితో అతను వాదిస్తూ వచ్చాడు. ‘ ఇందులో నేను ఒక్క రూపాయి కూడా లాభం తీసుకోను.. ఇంకా అంతో ఇంతో నాకే చేతి నుంచి పడుతుంది.. పేద, మధ్య తరగతి వారికి కూడా ఉమ్రా దర్శన భాగ్యం కల్పించాలన్నదే నా ఉద్దేశం’ అని చెబుతూ వచ్చాడు.
ఇందులో భాగంగా అతను కొన్ని రోజుల క్రితం అన్ని ప్రాంతాల నుంచి కొంత మందిని ఎంపిక చేసుకొని ఉమ్రాకు పంపించాడు. వారు తిరిగి వచ్చిన తర్వాత నమ్మ కం కలగడంతో డబ్బు కట్టడానికి ట్రావెల్స్ వద్ద క్యూలో నిల్చున్నారు. డబ్బు కట్టడానికి వచ్చిన కొందరిని రెండు, మూడు రోజుల తర్వాత రమ్మ ని కూడా సిబ్బంది చెప్పేవారు. ఇలా ఒక్కో ప్రాం తం నుంచి రూ. కోట్లలో వసూలు చేసుకున్నాడు. డబ్బు కట్టిన కొందరికి ఉమ్రాకు వెళ్లే తేది కూడా చెప్పాడు. అయితే అతను చెప్పిన గడువు తీరడంతో చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. విమానాలు దొరకడం లేదని, నెల, రెండు నెలలు ఆలస్యం అయినా ఉమ్రాకు పంపిస్తానని నమ్మబలికే వాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో స్థానిక ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. సుమారు 20 రోజులుగా ప్రధాన ఏజెంట్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో కింది స్థాయి వారిలో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ప్రొద్దుటూరు, కడపతో పాటు ఇతర ప్రాంతాల్లో ట్రావెల్స్ కార్యాలయాలను మూసి వేశారు.
రూ, కోట్లలో వసూలు..
అతను ఉమ్రాకు పంపిస్తానని పేద, మధ్య తరగతి ప్రజల వద్ద నుంచి రూ. కోట్లలో డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే వారందరూ రూ.14 వేల చొప్పున డబ్బు చెల్లించిన వారు కూడా ప్రొద్దుటూరు, కర్నూలులో ఉన్నారు. ప్రొద్దుటూరులోనే సుమారు రూ. 6 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కడప, కర్నూలు, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, అనంతపురం తదితర ప్రాంతాల్లో కూడా రూ.కోట్లలో వసూలు చేసినట్లు సమాచారం. రోజు రోజుకు స్థానికంగా ఉన్న బ్రాంచ్ కార్యాలయాల ఏజెంట్లపై ఒత్తిడి అధికం కావడంతో వారు కూడా కార్యాలయాలకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేఎస్‌ఎస్ ట్రావెల్స్ ప్రధాన ఏజెంట్ ఆలీ బెంగళూరులో ఉన్నాడని తెలియడంతో ఏజెంట్లే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమతో పాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో కూడా అతను బ్రాంచ్ కార్యాలయాలను తెరచినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలోనే అతను అందరి వద్ద వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కడపలో ఆస్తులు కూడగట్టుకున్న ఏజెంట్
ఏజెంట్ ఇటీవల కడపలో పెద్ద ఎత్తున ఆస్తులను కొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదంలో ఉన్న పాఠశాలను రూ. 1.5 కోట్లు చెల్లించి అతను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పాఠశాలలో చేరాలని కడపలో ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కొన్నాడు. ఉన్నట్టుండి అతనికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే సందేహం అతని బంధువులు, సన్నిహితుల్లో కూడా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment