పోలీసుల అదుపులో లగ్జరీ ‘లయన్‌’ | Lion Muttuvelu Arrested By Central Crime Branch In Chennai | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో లగ్జరీ మోసగాడు ముత్తువేల్‌

Published Wed, Oct 2 2019 11:03 AM | Last Updated on Wed, Oct 2 2019 11:04 AM

Lion Muttuvelu Arrested By Central Crime Branch In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఖరీదైన బంగ్లా, చుట్టూ అంగరక్షకులు, నిఘానేత్రాలు, ఐదారు సంస్థల పేరిట బోర్డులు, చిటికేస్తే చాలు క్షణాల్లో పనులు ముగించే రీతిలో చుట్టూ అధికారులు అంటూ లగ్జరీగా చెన్నైలో తిరుగుతూ వచ్చిన ముత్తువేల్‌ పోలీసులకు టార్గెట్‌ అయ్యాడు. పారిశ్రామిక వేత్తగా చెలామణిలో ఉంటూ రాజకీయ పలుకుబడితో లగ్జరీ మోసాలకు ఇతగాడు పాల్పడుతుండడం వెలుగులోకి రావడం గమనార్హం.

విల్లివాక్కం రాజమంగళంలో ఖరీదైన బంగ్లా, చుట్టూ వందకుపైగా నిఘా నేత్రాలు, ముఫ్పై, నలభై మంది ప్రైవేటు అంగరక్షకులతో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ వస్తున్న పారిశ్రామిక వేత్త ముత్తువేల్‌. తన పేరుకు ముందు లయన్‌ అని చేర్చుకున్న ఇతగాడు, పోయెస్‌ గార్డెన్‌లో బావా, ముత్తువేల్, వారాహి పేర్లతో ఐదారు సంస్థల బోర్డులను తగిలించుకుని కార్యాలయం నడుపుతున్నాడు. రాజకీయ ప్రముఖులతో, పోలీసు ఉన్నతాధికారులు, అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఇతగాడి వద్దకు పలు రకాల పనుల నిమిత్తం అధికారంలో ఉన్న పెద్దవాళ్లు సైతం వచ్చి వెళ్తుంటాయని చెప్పవచ్చు. పోలీసు, ప్రభుత్వ, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల్లో చిటికేస్తే చాలు...క్షణాల్లో పనులు అవుతాయని నమ్మబలకడంతో తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సైతం ఆ బంగ్లాచుట్టూ తిరుగుతుంటారు. 

ఇలా..చిక్కాడు...
డీఎంకేలో రాజకీయ ప్రముఖుడి కూడా చెలామణిలో ఉన్న లయన్‌ ముత్తువేల్‌ అనేక మందికి బ్యాంక్‌ రుణాలు, మరెన్నో పనులు చేసి పెట్టి అందుకు తగ్గ కమిషన్లు పొందుతూ రావడం తాజాగా వెలుగులోకి వచ్చింది. రూ. వంద కోట్ల మేరకు ఇతగాడి మోసాలు ఉన్నట్టుగా బయట పడింది. రాజస్థాన్‌కు చెందిన నిఖిల్‌ æఅనే పారిశ్రామిక వేత్త తమిళనాడులో తన నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం, అందుకు తగ్గ అనుమతుల వ్యవహారాలన్నీ ముత్తువేల్‌ చేసి పెట్టే రీతిలో డీల్‌ కుదుర్చుకుని ఉన్నారు. అలాగే, బ్యాంక్‌లో రూ.వంద కోట్ల రుణం ఇప్పించేందుకు కూడా చర్యలు చేపట్టి ఉన్నారు. బ్యాంక్‌ రుణం సిద్ధమైన సమాచారంతో కమిషన్‌గా రూ. 2.5 కోట్లను ముత్తువేల్‌కు నిఖిల్‌ ముట్ట చెప్పి ఉన్నాడు. అయితే, రుణం అన్నది రాని దృష్ట్యా, పలుమార్లు ప్రశ్నించగా, అంగరక్షకులు నిఖిల్‌ను భయపెట్టి రాజస్తాన్‌లో వదలి పెట్టి వచ్చి ఉన్నారు. పలుమార్లు ప్రశ్నించినా, కేవలం బెదిరింపులే. 

ఇక్కడి అధికారులు, కొందరు పోలీసు బాసులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా ముత్తువేల్‌ వెన్నంటి ఉండడంతో రాజస్తాన్‌ రాజకీయాన్ని నిఖిల్‌ ప్రయోగించినట్టున్నాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలో ఏమోగానీ చెన్నై క్రైంబ్రాంచ్‌ విభాగంకు చెందిన ప్రత్యేక బృందం లగ్జరీ మోసగాడి కోసం  మాటేసింది. సోమవారం తన బర్త్‌డే వేడుకల్లో మునిగి తేలుతున్న ఈ లగ్జరీ మోసగాడ్ని పథకం ప్రకారం తమ అదుపులోకి  తీసుకున్నారు. ఈ బర్త్‌డే వేడుకకు పలువురు మాజీ అధికారులు సైతం వచ్చి ఉన్నా, వారితో తమకేంటి అన్నట్టుగా ముత్తు వేల్‌ను ఆ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నది. ఇతగాడి చేతిలో మోసపోయిన వాళ్లు మరెందరో ఉన్నట్టు, తమకు ఫిర్యాదు చేస్తే, విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆ బృందం ప్రకటించి ఉన్న దృష్ట్యా, ఈ మోసగాడి చిట్టా చాంతాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతడ్ని కోర్టులో హాజరు పరిచి, కస్టడీకి తీసుకునేందుకు  ఆ ప్రత్యేక బృందం పరుగులు తీస్తున్నది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement