కర్ణాటక, బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంటిలో దాచిపెట్టిన ఘటన కలబురిగి జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. కలబురిగి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామానికి చెందిన లారీ డ్రైవరు శ్రీశైల్‌కు పదేళ్ల క్రితం సంగీతా సక్కరగి (35)తో వివాహమైంది. వీరికి పుట్టిన బిడ్డ ఇటీవల మృతి చెందింది. అప్పటి నుంచి సంతానం కలగలేదు. పిల్లలు పుట్టలేదనే కారణంతో భార్యను శ్రీశైల్ వేధించేవాడు. మరో వివాహం చేసుకోవడానికి విడాకులు ఇస్తానని బెదిరించేవాడు. ఇదే విషయంపై మూడురోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన శ్రీశైల్, భార్య సంగీతా మెడకు తాడు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టి మిన్నకుండిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆరా తీయగా విషయం బయటపడింది. పోలీసులు శ్రీశైల్, అతని తల్లి పార్వతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment