
భీమవరం మండలం లోసరిలో సర్క్యూట్‌తో దగ్ధమైన టిప్పర్ లారీ
భీమవరం అర్బన్: భీమవరం మండలం లోసరి గ్రామంలో టిప్పర్ లారీకి విద్యుత్ వైరు తగిలి మంటలు చెలరేగి లారీతోపాటు డ్రైవర్ కాలిపోయిన దుర్ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోసరి గ్రామంలో జాతీయ రహదారి 216(ఏ) విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా జి.కొండూరు నుంచి కంకర రాళ్లను సుమారు 10 టిప్పర్ లారీల ద్వారా చేరవేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి ఏపీ16టీఈ 6850 లారీ నుంచి రాళ్ల అన్‌లోడింగ్‌కు హైడ్రోలిక్ సిస్టం ద్వారా ట్రక్కును పైకి లేపి రాళ్లు అన్ లోడింగ్ చేశారు. అన్ లోడింగ్ అయిన తరువాత ట్రక్కును యథాస్థానానికి దించకుండా ముందుకు లారీని పోనివ్వటంతో పైనున్న 11 కేవీ విద్యుత్ వైరు లారీ పైభాగంలో తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో జి.కొండూరు గ్రామానికి చెందిన డ్రైవర్ పొజ్జూరు నరసింహరావు (45) లారీలో సజీవ దహనమైపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నరసింహరావు మోకాళ్ల వరకు ఎముకలు కూడా మిగిలకుండా దహనమైన ఘటన స్థానికులను కలచి వేసింది. నరసింహరావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. అతని కుమాడు పొజ్జూరు గోపి ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్సై శ్రీరామచంద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment