సాక్షి, ఒంగోలు క్రైం: తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించబోయాడు ఓ మృగాడు. సమయానికి బాధితురాలి తల్లిదండ్రులు వచ్చి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు ప్లైఓవర్ సమీపంలో ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తున్న సాధిక్ అనే యువకుడు స్థానిక సుజాతనగర్‌లో నివసించే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. డిగ్రీ చదువుతున్న ఆ యువతి అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో పలుమార్లు సాధిక్ ఆ యువతి ఇంటికి వచ్చి బెదిరించాడు. తల్లిదండ్రులకు ఇది తెలిసినప్పటికీ పరువుపోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో పెట్రోల్ డబ్బాతో యువతి ఇంటికి వచ్చిన యువకుడు వాకిట్లో ఉన్న ఆ యువతిపై పెట్రోలు పోశాడు. ఆమె తేరుకొని కేకలు వేయడంతో తల్లిదండ్రులు బయటకు వచ్చారు. అడ్డుకోబోయిన వారిపై కూడా ఆ ఉన్మాది పెట్రోలు కుమ్మరించాడు. అతడు వెంట తెచ్చుకున్న లైటర్‌తో నిప్పటించబోయాడు. పెనుగులాటలో లైటర్ కిందపడిపోయింది. ఇంతలో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోవడంతో పెద్దగా కేకలు వేస్తూ సాధిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment