ప్రియుడు శివాజీతో హరితేజ (ఫైల్), పెళ్లి పీటలపై హరితేజ
విశాఖపట్నం, రావికమతం: రెండేళ్లుగా ప్రేమించాడు... కులాలు వేరైనా వివాహం చేసుకుంటానన్నాడు.తీరా వివాహ ముహూర్తం సమయానికి పరారై యువతికి తీరని ఆవేదన మిగిల్చాడు. న్యాయం చేయాలని కోరుతూ ఆ దళిత యువతి అత్తింటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన దళిత యువతి కొత్తి హరితేజ (20) అదే గ్రామం కాపు సామాజిక వర్గానికి చెందిన గూటాల శివాజి (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
కులాలు వేరైనా..
హరితేజ విశాఖలో బీఎస్సీ నర్సింగ్ చేస్తుండగా శివాజి పీజీ చేసి గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులాలు వేరైనా పెద్దల అంగీకారం లేకున్నా వివాహం చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ మరింత దగ్గరయ్యారు. అయితే శివాజీకి గర్నికం గ్రామానికి చెందిన మరొక యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న హరితేజ గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. పెద్దలు సైతం ప్రేమించిన యువతికి న్యాయం చేయాలని హితవు పలికారు.తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని అవసరమైతే హరితేజకు నష్టపరిహారం చెల్లిస్తామని శివాజి రాజీకి ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు.
పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా..
వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. దీనిపై ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావును ఆశ్రయించింది. ఆయన శివాజీ, తల్లిదండ్రులకు ఇటీవల కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వివాహానికి ఒప్పుకున్న శివాజి పెద్దల సమక్షంలో పూచీకత్తులు కూడా రాశాడు. ఈ మేరకు గురువారం రోలుగంటలోని దేవాలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయం వరకూ వచ్చేస్తున్నానంటూ చెప్పిన శివాజీ ఆపై ముహూర్తం దాటిపోయినా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన పెండ్లికుమార్తె హరితేజ మర్రివలసలో అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రియుడు శివాజి, అతని తల్లిదండ్రులు భవాని, తాతబ్బాయితోపాటు గర్నికం, బైలపూడి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తకోట ఏఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment