వెల్దుర్తి వద్ద హైవేలో దొంగల లారీని తనిఖీ చేస్తున్న పోలీసులు
సాక్షి,కర్నూలు: రన్నింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస దోపిడీలకు పాల్పడి.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘హైవే దొంగలు’ పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి వెల్దుర్తి, పాణ్యం వద్ద హైవేలపై పక్కా స్కెచ్‌తో వారిని పట్టుకుని ‘శభాశ్ పోలీస్’ అనిపించారు. ముగ్గురు దొంగలతో పాటు రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగలను రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేసే తీరు, ముఠా తీరుతెన్నులు, జీవనశైలి, అక్కడి రాజకీయనేతల అండదండలు తదితర అంశాలను పరిశీలిస్తే.. వీరు అత్యంత చాకచక్యంగా, కిరాతకంగా దోపిడీలు చేసే ‘గ్యాంగ్‌స్టర్స్’గా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 4న నంద్యాల– పాణ్యం మధ్యలో ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్స్’, 5న డీటీడీసీ, అదే రోజు మళ్లీ ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్స్’, 6న కర్నూలు– బెంగళూరు హైవేలో ‘ఎక్స్‌ప్రెస్ బీస్’ కొరియర్ వాహనాలను రన్నింగ్‌లోనే దొంగలు కొల్లగొట్టారు.
ఈ ఘటనల నేపథ్యంలో ఈ నెల 10న ‘హైవే దొంగలు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. వీరు దోపిడీలు చేసే తీరు గురించి సమగ్రంగా వివరించింది. ఈ కేసులను ఎస్పీ ఫక్కీరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువగా దోపిడీలు జరిగినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని సెల్‌టవర్ల నుంచి వెళ్లిన సిగ్నల్స్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన కొన్ని ఫోన్ నంబర్లపై నిఘా పెట్టారు. వాటికి సంబంధించిన సిగ్నల్స్ కొద్దిరోజుల తర్వాత మళ్లీ కన్పించాయి. దీంతో హైవేల్లో పోలీసులతో గస్తీ ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు ప్రశి్నంచగా.. వారు మధ్యప్రదేశ్ వాసులుగా తేలింది. వారు వచ్చిన లారీల నంబర్ ప్లేట్లు మాత్రం రాజస్థాన్ రిజి్రస్టేషన్‌తో ఉన్నాయి. అనుమానంతో వారిని పట్టుకునేందుకు యతి్నంచగా.. కొందరు పారిపోయారు. ముగ్గురు దొరికారు. రెండు లారీలు పట్టుబడ్డాయి. వాటిలో ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు లభించాయి. దొంగలను కర్నూలులోని పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణలో విస్తుపోయే వాస్తవాలు
హైవేలో రన్నింగ్ వాహనాలను కొల్లగొట్టడంలో వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. 20–35 ఏళ్ల వయసున్న యువకులే ముఠాలో ఉంటారు. గ్యాస్‌కట్టింగ్, గోడలు పగలగొట్టడం, సీసీ కెమెరాలు, ఎలక్ట్రికల్ వస్తువుల నియంత్రణ ఇలా.. ముఠాలో ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి రాబరీ(నలుగురు, అంత కంటే తక్కువ మంది), డెకాయిట్ (ఐదుగురు, అంతకంటే ఎక్కువ..) గ్రూపుల్లో ఉంటారు. బైక్ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, రైళ్లలో దోపిడీలు, బ్యాంకులు, ఏటీఎంలతో పాటు ధనవంతుల ఇళ్లలో చోరీలకు తెగిస్తారు. ఈ ముఠాలన్నీ ఆర్గనైజింగ్ గ్యాంగ్‌లు. వీటికి డాన్‌లు ఉంటారు. కేసుల్లో ఇరుక్కుంటే బయటకు తీసుకొచ్చే బాధ్యతను లాయర్లు, డాన్‌లు చూసుకుంటారు. ఏపీలో ఈ తరహా ఆర్గనైజింగ్ గ్యాంగ్‌లు లేవు.
మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ..
మధ్యప్రదేశ్‌లో ఆది నుంచి తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. ఒక భవంతి కూడా లేకుండా గుడిసెలు, రేకుల షెడ్లు మాత్రమే కని్పంచే గ్రామాలెన్నో! వీరికి బతికేందుకు ఉపాధి ఉండదు. జంతువులను వేటాడి.. వాటి మాంసాన్ని అమ్మి బతికేవాళ్లు ఎందరో ఉన్నారు. అలాగే కొన్ని తెగలకు చెందిన వారు దొంగతనాలకు అలవాటు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడదామంటే వారి పరిస్థితీ అంతంత మాత్రమే. దీంతో పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో చోరీలు మొదలెట్టారు. అక్కడ చోరీలు ఎక్కువ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దొంగలను కాల్చేసేలా ఉత్తర్వులు ఇచి్చంది. దీంతో వారి దృష్టి దక్షిణాదిపై పడింది. ఉత్తరాదితో పోలి్చతే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం వినియోగం ఎక్కువ. ఉత్తరాది మహిళలు పండుగ, ఏదైనా ఫంక్షన్ జరిగితేనే బంగారు ఆభరణాలు వేసుకుంటారు. కానీ ఇక్కడి మహిళలు నిత్యం బంగారాన్ని వాడతారని వారి అభిప్రాయం. దీనివల్లే తమిళనాడు, కర్ణాటక, ఏపీలో దొంగతనాలకు అలవాటుపడ్డారు. హైవే దోపిడీలతో పాటు సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా రైళ్లలోకి ప్రవేశించి..ప్రయాణికుల నుంచి బంగారు, నగదు కూడా దోచేస్తారు. ఇలా వచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా మద్యంతాగి, ఇష్టమైన ఆహారం తిని.. పేకాట ఆడతారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్నది వీరి ఫిలాసఫీ.
చంపేందుకూ వెనుకాడరు!
ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు వీరిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్‌కు వెళితే దాడులకు తెగబడతారు. దొంగల ఇళ్లలోని మహిళలు దుస్తులు చించుకుని పోలీసులపైనే అత్యాచారం కేసులు నమోదు చేయిస్తారు. అక్కడి హక్కుల సంఘాలు కూడా వీరికి అనుకూలం. మురికివాడలు, మారుమూల పల్లెల్లో నివసించే పేదలను పోలీసులు వేధిస్తున్నారంటూ వారి తరఫున ఆందోళనలు చేస్తాయి. వీరికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఇళ్లు ఉండవు. గుడిసెలు మాత్రమే ఉంటాయి. పైగా అక్కడి పోలీసులతో మంచి సంబంధాలు కల్గివుంటారు. దీంతో మన పోలీసులకు సహకరించరు. ప్రస్తుతం జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు దొంగలు ఉండగా.. రాష్ట్రంలోకి కనీసం 50–100 మంది ముఠా సభ్యులు ప్రవేశించి ఉంటారని సమాచారం
దొంగలు దొరికారు..విచారిస్తున్నాం
రన్నింగ్‌లోని వాహనాలను కొల్లగొట్టే ముఠాను పట్టుకున్నాం. రెండు లారీలు, ముగ్గురు వ్యక్తులు అదుపులో ఉన్నారు. మా విచారణలో కొన్ని విషయాలు తెలిశాయి. పూర్తి వివరాలను విచారణ ముగిసిన తర్వాత వెల్లడిస్తాం. – ఫక్కీరప్ప, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment