
దీపిక, శ్యాంప్రసాద్ జంట (పెళ్లినాటి ఫొటో)
సాక్షి, పాకాల : నపుంసకత్వాన్ని కప్పిపుచ్చి ఒక యువతిని వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా అదనపు వరకట్నం కోసం చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టిన ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. సంసార జీవితానికి పనికిరాడనే విషయంపై భర్తనపు నిలదీయడంతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. దీంతో బాధితురాలు మరో యువతి బలి కారాదనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు పంచాయతీ మొరవపల్లెకు చెందిన వ్యవసాయ నేపథ్యం కలిగిన ఉషారాణి, రాజేంద్రనాయుడు(లేట్) దంపతుల కుమార్తె బి.దీపిక ఎంబీఏ చదివింది. చిత్తూరు రామ్‌నగర్ కాలనీలో నివాసం ఉం టున్న సుజాత, గోవిందస్వామినాయుడుల కుమారుడు ఎం.జి.శ్యాంప్రసాద్ (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)తో 2017 ఆగస్టు 13న తిరుమలలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. వరకట్నంగా రూ.2 లక్షలు, అదనంగా మరో లక్షతోపాటు, శ్యాంప్రసాద్‌కు 25 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. శ్యాంప్రసాద్, దీపిక ఇద్దరూ బెంగళూరులోనే ఉద్యోగం చేస్తుండడంతో అక్కడే కాపురం పెట్టారు.
బండారం బట్టబయలు
అయితే, శ్యాంప్రసాద్ సంసార జీవితానికి పనికిరాడని రోజుల వ్యవధిలోనే దీపిక తెలుసుకుంది. అతని వద్ద కొన్ని రకాల మాత్రల ప్రిస్కిప్షన్ లభించడంతో ఆమె అనుమానించింది. ఆ మాత్రలు పుంసత్వం కోసం వాడతారని, అతను గుట్టుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు తెలుసుకుంది. ఇదే విషయమై భర్తతోపాటు అత్తమామలను నిలదీసింది. తమ కుమారుడు సంసార జీవితానికి పనికిరాడని వారు వెల్లడించారు. ఈ విషయం చెప్పి పరువు తీయొద్దని ప్రాధేయపడటంతో బాధను దిగమింగింది. తన జీవితాన్ని నాశనం చేశారంటూ దీపిక అసలు విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది.
దిగ్భ్రాంతికి గురైన ఆమె తమ బంధువులతో వియ్యంకులను ఈ విషయంగా ప్రశ్నించడంతో వారు దీపికపై కక్ష కట్టారు. అదనపు కట్నం మరో లక్ష రూపాయలు తేవాలంటూ అత్తమామలు వేధించసాగారు. భర్త ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించాడు. మరో పెళ్లి చేసుకుంటానని, దిక్కున్న చోట చెప్పుకో అంటూ దాష్టీకం ప్రదర్శించేవాడు. వారి బాధలు పడలేక దీపిక పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న రూపంలో ఇచ్చిన లాంఛనాలతో పాటు వివాహానంతరం జీతం తాలూకు సొమ్మును ఇప్పటివరకు దాదాపు 3లక్షల రూపాయలు భర్తకు ఇచ్చానని, వాటన్నింటికీ ఇప్పించాలని, తనను వేధిస్తున్న భర్త, అత్తమామలు, మరదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. నిందితులను అరెస్ట్ చేశామని, వారిపై చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment