
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను నిర్లక్ష్యం చేస్తుందనే కోపంతో ఓ యువకుడు ప్రియురాలితో పాటు ఆమె తమ్ముడిని కాల్చి చంపేశాడు. నవంబరు 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు... కౌశాంబికి చెందిన షీలా(16) తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమెకు పుర్వా గ్రామానికి చెందిన గంగా ప్రసాద్(20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్లుగా షీలా.. ప్రసాద్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో మరో యువకుడితో ఆమె స్నేహం చేస్తున్నట్లుగా అనుమానించిన ప్రసాద్.. షీలాకు బుద్ధి చెప్పాలని భావించాడు. వారం రోజుల క్రితం ఆమె హత్యకు పథకం రచించాడు.
ఈ క్రమంలో షీలా తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లారని తెలుసుకున్న ప్రసాద్ నాటు తుపాకీతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తొలుత షీలాపై అత్యాచారానికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేస్తూ అందరినీ పిలిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన ప్రసాద్ ఆమె కణతిపై కాల్చి చంపేశాడు. అదే విధంగా తన అక్క అరుపులు విని గది నుంచి బయటకు వచ్చిన షీలా తమ్ముడు రాజేంద్ర(12)ను కూడా తుపాకీతో కాల్చి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో అక్కాతమ్ముళ్లు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కాగా షీలా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ జాడ కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసాద్ నేరాన్ని అంగీకరించాడని... తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తుందనే కారణంగానే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment