లింక్‌ ఓపెన్‌ చేయడంతో ఆమె బుక్కైపోయింది..! | Man Arrested By Rachakonda police For Cheating Women Using Facebook | Sakshi
Sakshi News home page

లింక్‌ ఓపెన్‌ చేయడంతో ఆమె బుక్కైపోయింది..!

Published Mon, Nov 4 2019 5:59 AM | Last Updated on Mon, Nov 4 2019 10:49 AM

Man Arrested By Rachakonda police For Cheating Women Using Facebook - Sakshi

సాక్షి, హైదరాబాద్‌; కష్టపడటం కంటే మోసగించడం ద్వారానే ఈజీగా మనీ సంపాదించొచ్చన్న దురాశతో కొంతమంది తప్పుడు మార్గాలను ఎంచుకుని జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే పనుల్లో ఒకటి ఆన్‌లైన్‌ మోసం. సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఈ రకమైన ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇలా ఆన్‌లైన్‌లో మోసం చేసి డబ్బులు సంపాదించడం..చేసిన తప్పు ఏదో రూపంలో బట్టబయలై నేరస్తులు కావడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం.

నేరస్తుడిగా మారి మనిషిగా పతనమైపోవడానికి దురాశ దుఃఖానికి చేటన్న చిన్న లాజిక్‌ను మరచిపోవడమే. అలా ఓ ప్రబుద్ధుడు ఇతరుల డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ మహిళ ఫేస్‌బుక్‌ వివరాలు తస్కరించి, ఆమె స్నేహితులతో సదరు మహిళగానే చాట్‌ చేసి వారి నుంచి డబ్బులు తీసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

ఫిషింగ్‌ సైట్‌ నుంచి లింక్‌ పంపి..
కొద్దికాలం క్రితం బాధిత మహిళ ఫేస్‌బుక్‌ ఖాతాకు బాలాపూర్‌ మండలం జిల్లెలగూడ వాసి బత్తుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఓ ఫిషింగ్‌ వెబ్‌సైట్‌(స్పూఫ్‌ సైట్‌) నుంచి ఓ లింక్‌ను పంపించాడు. సదరు మహిళ ఆ లింక్‌ను ఓపెన్‌ చేయడంతో ఆమె ఫేస్‌బుక్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను అతడు సేకరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి బాధిత మహిళ ఫేస్‌బుక్‌ ఖాతాను ఓపెన్‌ చేయడంలేదు. ఇదే సమయంలో నిందితుడు వెంకటేశ్వర్లు బాధిత మహిళ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆమె స్నేహితులతో మహిళగా చాటింగ్‌ చేయడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని, చికిత్స కోసం డబ్బులు సాయం చేయాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టాడు. తమ స్నేహితురాలే సాయం కోరుతుందనుకుని ఆ మెసేజ్‌లకు స్పందించిన కొంతమంది అతడిచ్చిన బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు జమచేశారు. డబ్బుల పంపాలంటూ బాధిత మహిళ వ్యక్తిగత స్నేహితురాలికి మెస్సేజ్‌ రావడంతో ఈ విషయాన్ని నేరుగా బాధితురాలి దృష్టికి తీసుకెళ్లింది. ఫేస్‌బుక్‌ ఖాతాను బాధిత మహిళ ఓపెన్‌ చేసినా ఓపెన్‌ కాకపోవడంతో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..ఈ నేరానికి పాల్పడింది బీటెక్‌ చదివి ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ కంప్యూటర్‌ గ్రాఫిక్‌ కార్యాలయంలో పనిచేస్తున్న బత్తుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దీంతో ఆదివారం అతడిని అరెస్టు చేశారు. బాధితమహిళనే కాకుండా ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, వెంకటేశ్వర్లు తను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్‌కు కానీ, సోషల్‌ మీడియాలో గానీ లింక్‌లు వస్తే ఓపెన్‌ చేయవద్దని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement