
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ఆవేశంలో భార్యను చితగొట్టి.. అనంతరం భర్త ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. జహంగిరిపురికి చెందిన మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఏడాది క్రితం ఆమె రిక్షా డ్రైవర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. పెళైన తర్వాత కొన్ని నెలలు సజావుగానే సాగిన వీరి దాంపత్యం అనంతరం ముగ్గురు పిల్లల విషయంలో గొడవలు రావడం ప్రారంభమైంది. ఆ ముగ్గురు పిల్లలను రెండో భర్త అంగీకరించకపోవడంతో వీరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. పిల్లలను తన తల్లి దగ్గర వదిలేయమని తరుచూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన భర్త ఇదే విషయంపై మరోసారి వాగ్వాదానికి దిగారు. పిల్లల ముందే భార్యతో కొట్లాటకు దిగి.. ఆవేశంతో సుత్తితో ఆమె తలపై దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన మహిళ గట్టిగా అరవడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తీవ్ర రక్తస్రావం అయిన మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మహిళపై దాడి చేయడంతో కుటుంబ సభ్యులు సదరు భర్తపై కేసు నమోదు చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతలోనే ఆదివారం ఉదయం స్థానిక పార్కులోని చెట్టుకు భర్త ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment