
వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీధర్, వెనుక ముఖానికి మాస్క్‌తో నిందితుడు
సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం) : ఒక మహిళను ప్రేమించి.. మరో మహిళను పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భోగాపురం సీఐ సీహెచ్ శ్రీధర్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా చిక్కాలపాలెం మండలం చాగల్లు గ్రామానికి చెందిన కముజు బాలాజీ (30) శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పరిధిలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. ఈ సమయంలో పూసపాటిరేగ ప్రాంతానికి చెందిన ఒక మహిళ అదే కంపెనీలోని క్యాంటీన్‌లో పని చేసేది. రోజూ క్యాంటిన్‌కు రావడంతో బాలాజీకి ఆ మహిళతో పరిచయం పెరిగింది. దీంతో బాలాజీ ఆమె ఇంటికి కూడా తరచూ వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఆమె కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. ఇది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెదతాడివాడ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బాధితురాలితో బాలాజీ కొంతకాలం గడిపాడు. ఈ సమయంలో అరబిందో ఫార్మా కంపెనీ నుంచి విశాఖ జిల్లా పరవాడలో ఉన్న ఫోరస్ కంపెనీకి నిందితుడు మారిపోయాడు. అప్పటి నుంచి బాధితురాలిని దూరంగా ఉంచాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీయగా... 20 రోజుల కిందట విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన వేరే మహిళను బాలాజీ వివాహం చేసుకున్నట్లు గుర్తించి వెంటనే డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ శ్రీధర్, డెంకాడ ఎస్సై ఎస్.భాస్కరరావు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.
నమ్మించి మోసం..
బాడంగి: ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి.. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన నయవంచకుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బొబ్బిలి రూరల్ సీఐ బీఎండీ ప్రసాద్ శుక్రవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డొంకినవలస గ్రామానికి చెందిన సామిరెడ్డి పరశునాయుడు అదే గ్రామానికి చెందిన యువతిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు తాజాగా వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు బాడంగి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న ఎస్సై సురేంద్రనాయుడు కేసు నమోదు చేయగా.. బొబ్బిలి సీఐ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం శుక్రవారం నిందితుడ్ని అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టుకు తరలించగా..న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment