అత్తింటి వారి వేధింపుల వల్లే కుమారుడు బలి | Man Commits Suicide With Love Marriage Failed In Hyderbad | Sakshi
Sakshi News home page

విషాద ప్రేమలు..!

Published Fri, Sep 21 2018 8:18 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Man Commits Suicide With Love Marriage Failed In Hyderbad - Sakshi

రోదిస్తున్న శ్రీకాంత్‌ తండ్రి , ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్‌ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ–పెళ్లి..వీటితో పాటే వివాదం. సిటీలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. బుధవారం కన్నతండ్రే కూతురు, అల్లుడిపై కత్తితో దాడికిపాల్పడగా...గురువారం ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దూరం కావటాన్ని జీర్ణించుకోలేని శ్రీకాంత్‌అనే యువకుడు సంతోష్‌నగర్‌రక్షాపురంలో సెల్ఫీలో సూసైడ్‌ డిక్లరేషన్‌ ఇచ్చి..తనకు తానే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న వైనం అందరిలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉంటే బోరబండలో నివాసం ఉంటూ ప్రేమ వివాహం చేసుకుని కన్న తండ్రి చేతిలో కత్తిపోట్లకు గురైన మాధవి యశోద ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎడమ చెయ్యి పూర్తిగా తెగిపోగా చెవి, దవడ భాగంతో పాటు గుండె నుండి మెదడుకు రక్తాన్ని తీసుకుపోయే నాలాలు తెగిపోయాయి. ఎనిమిది గంటల పాటు ప్రత్యేక వైద్యుల బృందం శస్త్ర చికిత్సలు చేసి ఆమె ప్రాణాలను కాపాడేందుకు శత ప్రయత్నాలు చేస్తోంది. వైద్యానికి ఆమె శరీరం సహకరిస్తుందని, మరో 36 గంటలు గడిస్తే కానీ పూర్తి భరోసా ఇవ్వలేమని వైద్యులు పేర్కొనటంతో ఆమె బంధువులు, సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది.

కుటుంబాలు..చెల్లా చెదురు
బుధ, గురువారాల్లో నగరంలో చోటు చేసుకున్న ప్రేమ–పెళ్లి –వివాదాల నేపథ్యంలో నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూతురు మాధవిపై దాడికి పాల్పడ మనోహరచారిని పోలీసులు జైలుకు పంపగా, కూతురు ఆస్పత్రిలో, భార్య లక్ష్మి, కొడుకు నవీన్‌లు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. కన్నకూతురు చావూ బతుకుల మధ్య ఉన్నా చూడలేక తమ ఇంటి పక్క వారికి తరచూ ఫోన్లు చేస్తూ బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్లు తెలిసింది. మాధవి, సందీప్‌ కుటుంబాలు నిరుపేదవే కావటం, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఫీజు లేకుండానే యశోద వైద్యులు అధునాతన వైద్యాన్ని అందజేస్తున్నారు. ఇక పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌ కుటుంబం సైతం పెద్ద దిక్కును కోల్పోయింది. బీ ఫార్మసీ చదువుకున్న తన కొడుకు ఉన్నత ఉద్యోగంలో చేరి తమకు అండగా ఉంటాడనుకుంటే..ఇలా అందరి ముందే అగ్నికి ఆహుతి అవుతాడనుకోలేదంటూ ఆయన తండ్రి ముత్యాలు రోదనలు అందరినీ కలిచివేశాయి. ఈ రెండు ఘటనలు వెను వెంటనే చోటు చేసుకోవటంతో నగరంలో ఎవరినోట విన్నా ప్రేమ– పెళ్లి– వివాదాలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి.

అత్తింటి వారి వేధింపుల వల్లే మా కుమారుడు బలి– శ్రీకాంత్‌ తల్లిదండ్రుల ఆరోపణ
సుల్తాన్‌బజార్‌: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తన కుమారుడి మరణానికి అతని అత్తింటి వారే కారణమని ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్‌ తండ్రి ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ మేరకు బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు శ్రీకాంత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీహర్ష తండ్రి షణ్ముకచారి తమపై పగబట్టాడని ఆరోపించారు. పోలీసు కేసులతో తమ కుటుంబాన్ని వేధించడం, తమ కోడలిని ఇంటికి రానివ్వకుండా చేయడంతో మనస్థాపం చెంది తమ కుమారుడు శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. ప్రేమించిన భార్యతో పాటు అతని అత్తమామల మోసం వల్ల మనోవేదనకు గురైన శ్రీకాంత్‌...సామాజిక మధ్యంలో తన చావుకు తన మామతో సహా అతని కుటుంబ సభ్యులు కారణమని సూసైడ్‌నోట్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు బోరున విలపించారు. ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. తమ కుటుంబానికి షణ్ముకచారి, అతని కుటుంబసభ్యులతో ప్రాణాహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో శ్రీకాంత్‌ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అతని స్వగ్రామానికి పంపించారు. ఈ మేరకు సంతోష్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement